Ayodhya Ram Mandir: సాధారణంగా వార్తాపత్రికలు ప్రజల కోణాన్ని ఆవిష్కరించాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో విశదీకరించాలి. కానీ తెలుగు నాట వార్తాపత్రికలకు ఈ సోయిలేనట్టు కనిపిస్తోంది. మూడ్ ఆఫ్ ది నేషన్ ఒకటైతే.. అవి ప్రచురిస్తున్న వార్తలు మరొక విధంగా ఉంటున్నాయి. సోమవారం అభిజిత్ లగ్నంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కొన్ని పత్రికలు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తే నవ్వొచ్చింది. అసలు ఆ గుడి ఎందుకు నిర్మించారు? దాని ప్రత్యేకత ఏమిటి? అసలు ఆ రాముడి ప్రతిష్టను ప్రాణ ప్రతిష్ట అని ఎందుకు పిలుస్తున్నారు? కొన్ని రోజులుగా దేశం మొత్తం ఈ రాముడి గురించి ఎందుకు మాట్లాడుకుంటుంది? అనే విషయాలేవీ ఆ వార్తాపత్రికలు పట్టించుకోనట్టు కనిపిస్తోంది. అసలు ఆ వార్తాపత్రికలకు మోడీ వ్యతిరేక స్టాండ్ ఏమిటో? మెజారిటీ ప్రజల అనుకూల స్టాండ్ ఏమిటో ఇప్పటికీ తెలియడం లేదు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనలో మోడీ పాల్గొన్నాడు కాబట్టి దానిని గుడ్డిగా వ్యతిరేకించాలని తీర్మానించుకున్నాయి కాబోలు. కనీసం ఆ వార్త ప్రయారిటీ ఏమిటో కూడా గుర్తించలేకపోయాయి.
ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఈ సండే మ్యాగ జైన్ లో అయోధ్య రాముడి గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. ఈనాడు కూడా అదే పని చేసింది. సాక్షి అయితే అది తన బాధ్యత కాదు అంటూ పక్కన పెట్టింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో అయోధ్య రాముడు గురించి విశేషమైన కథనాలు ఇవ్వడంతో నాలుక కరుచుకుని ఫ్యామిలీ పేజీలో ఏవో నాలుగు కథనాలు అలికి పారేసింది. ఇక ఆ నమస్తే గురించి చెప్పుకోవాల్సి వస్తే.. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట గురించి.. పక్కన పెట్టి అయోధ్య రాముడు అవతరణ నేడే అని భారీ హెడ్డింగ్ పెట్టింది. ఆల్రెడీ అక్కడ రాముడు పూజలు అందుకుంటున్న తర్వాత కొత్తగా అవతరించేది ఏమిటో ఆ పత్రిక పెద్ద తలకాయలకే తెలియాలి.. నవ తెలంగాణ పత్రిక అయితే మరీ దారుణం. అప్పట్లో యోగి ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్లో భారీ ఎత్తున రాముడి విగ్రహం ప్రతిష్టిస్తానని చెప్పాడట. ఏమోయ్ యోగి ఆ విగ్రహం మాటేమిటి అనే కోణంలోనే ఆ నవతెలంగాణ పత్రిక రాసింది. అంతే తప్ప నేడు అయోధ్యలో రాముడు విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతోంది అనే విషయాన్ని పొరపాటున కూడా రాలేదు. ఇక మిగతా పత్రికల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఎలక్ట్రానిక్ ఛానల్స్ విషయానికి వస్తే టీవీ9 నుంచి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరకు లైవ్ కవరేజ్ ఇచ్చాయి. టీ న్యూస్ మాత్రం ఎప్పటిలాగే తన గులాబీ డప్పు కొట్టుకొనుడు మొదలుపెట్టింది. అన్ని చానల్స్ లైవ్ టెలికాస్ట్ ఇస్తుంటే.. టీ న్యూస్ మాత్రం దాని ఓనర్ ఘనపరిపాలనలో జరిగిన అద్భుతాలను వల్లె వేయడం మొదలుపెట్టింది. అంతేకాదు దేశం మొత్తం రామ నామస్మరణ లో ఉంటే జగదీశ్ రెడ్డి ప్రెస్ మీట్ లైవ్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇవీ రాముడికి సంబంధించి తెలుగు మీడియా ఇచ్చిన కవరేజ్. కానీ ఇప్పటికీ ఆ మీడియా అధిపతులకు మోడీ యాంటీ స్టాండ్ ఏమిటో? అతడి తప్పులను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో తెలియడం లేదు. కానీ ఈ దిశలోనే వారు వేస్తున్న అడుగులు ఓ వర్గం వారిలో ఏవగింపు కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా ఉంది కాబట్టి కొంతలో కొంత ప్రజలకు తెలుస్తోంది. సోషల్ మీడియా లేకుంటే.. చెప్పడానికి ఏముంది గతం తాలూకు రోజులను గుర్తు చేసుకుంటే సరిపోతుంది కదా..