Homeఅత్యంత ప్రజాదరణఎంఐఎం చరిత్ర ఏంటి? జాతీయ పార్టీగా ఎలా ఎదిగింది?

ఎంఐఎం చరిత్ర ఏంటి? జాతీయ పార్టీగా ఎలా ఎదిగింది?

AIMIM History

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా.. గెలవకున్నా.. పార్టీ పెట్టినప్పటి నుంచి మజ్లిస్ పార్టీ గత ఐదున్నర దశాబ్దాల కాలంగా ప్రతీ ఎన్నికల్లో గెలుస్తూనే ఉంది. ఇదో వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా ముద్రపడింది. ఆ వర్గం అభివృద్ధి కోసమే పుట్టుకొచ్చిన పార్టీ అని చెప్పొచ్చు. పాతబస్తీలోని మున్సిపల్ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ తప్ప మరే పార్టీ గెలవడం అసాధ్యం అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగా సలావుద్దీన్ ఒవైసీ ఉన్నంతకాలం వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ నాలుగుసార్లు గెలిచారు. రాష్ట్రంలో ముస్లిం జనసాంద్రత ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా ఇతర పార్టీలకు పడే ఓట్లను చీల్చుతూ మజ్లిస్ పార్టీ విజయం సాధిస్తోంది. పరోక్షంగా సహకారం అందిస్తున్న పార్టీ విజయానికి కారణమవుతోందని తెలుస్తోంది.

Also Read: గ్రేటర్‌‌ హైదరాబాద్‌.. గ్రేట్‌ హిస్టరీ..

కానీ గెలిచిన నియోజకవర్గాలు, డివిజన్లలో మౌలిక సౌకర్యాలు, విద్యను అందించడంలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం వెనుకబడినట్లు తెలుస్తోంది. అన్ని ప్రాంతీయ పార్టీల తరహాలోనే మజ్లిస్ కూడా కుటుంబ పార్టీయే. మొదట వాహెద్ ఒవైసీ నేతృత్వంలోనూ, ఆ తర్వాత ఆయన కుమారుడు సలావుద్దీన్ ఒవైసీ అధ్యక్షతనా కొనసాగింది. ఆయన తదనంతరం అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన కొనసాగుతోంది. ఇప్పుడు పార్టీలో ఆయన, సోదరుడు అక్బరుద్దీన్ తప్ప నాయకులే లేరన్నది బహిరంగ రహస్యం.
ముస్లిం ఓటు బ్యాంకును చేజారిపోకుండా చూసుకోవడంలో, పార్టీని నడిపించడంలో అన్నదమ్ములదే సర్వాధికారం. బయటవారికి పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశమే లేకుండా పోయింది. ముస్లిమేతరులకు పోటీచేసే అవకాశం ఇస్తున్నా, ప్రధాన ఓటు బ్యాంకు మాత్రం ముస్లింలే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎంఐఎం 1927లో ఏర్పడింది. మొదట్లో ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. 1984 నుంచి హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని వరుసగా పార్టీ గెలుస్తూ వస్తోంది. 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించింది. అదే ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో గెలిచింది. దీంతో ఒక చిన్న నగర పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి పార్టీగా ఎంఐఎం మారింది.

బిహార్ అసెంబ్లీలో ఐదు స్థానాల్లో విజయం సాధించడంతో.. తెలంగాణ, మహారాష్ట్ర తర్వాత మూడో రాష్ట్రంలో పార్టీ ఖాతా తెరిచినట్లు అయింది. అంతేకాదు ఇప్పుడు తెలంగాణ తర్వాత పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నది బిహార్‌లోనే. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ తమ అదృష్టం పరీక్షించుకోవాలని ఎంఐఎం భావిస్తోంది. మరో ఆరు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ బిహార్‌లో కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు.

Also Read: ఉపాధ్యాయులను ఎన్నికలకు దూరంపెట్టడం కేసీఆర్ వ్యూహంలో భాగమేనా?

ముస్లిం సమస్యలను పార్లమెంటులో ఒవైసీ ప్రస్తావించడం వాస్తవమే. బాబ్రీ వివాదం, లవ్ జిహాద్ కేసులు, పౌరసత్వ సవరణ చట్టం, పౌర నమోదు పట్టిక ఇలా అన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు. ఆయన స్వరం పార్లమెంటులో చాలాసార్లు ధ్వనించింది. ఆయన చాలా మంది కంటే పార్లమెంటులో మెరుగ్గా మాట్లాడతారు. ముస్లింలలో ఆయన పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందన్న మాట కూడా వాస్తవమే. అయితే, అదే సమయంలో కొంతమంది ముస్లింలు దీనిపై ఆందోళన కూడా చెందుతున్నారు.

నిజాం కాలంలో ఉనికిలోకి వచ్చిన మజ్లిస్ పార్టీ 1948లో సర్దార్ పటేల్ పోలీసు చర్యతో నిర్వీర్యమైపోయింది. 1950వ దశకం చివరలో సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ తండ్రి వాహెద్ ఒవైసీ మళ్లీ పునరుద్ధరించారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం దాకా వచ్చింది. అసదుద్దీన్ ఒవైసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర రాష్ట్రాలకూ వ్యాపిస్తోంది.

1962లో జరిగిన ఎన్నికలతో ఒక్క సభ్యుడితో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది మొదలు ఆ తర్వాత ప్రతీ ఎన్నికల్లోనూ మజ్లిస్ తన ఎమ్మెల్యేలను సభలోకి పంపుతూనే ఉంది. ప్రస్తుత సభలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. పదేళ్ల క్రితం ఎమ్మెల్సీలను కూడా గెల్చుకుని మండలిలోకి కూడా అడుగుపెట్టింది. సమైక్య రాష్ట్రంలోనే రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన మజ్లిస్, ఆ తర్వాత మహారాష్ట్రలోనూ ఎమ్మెల్యేలను గెల్చుకుని అక్కడ కూడా గుర్తింపు పొందింది. చివరకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మజ్లిస్ పార్టీకి కామన్ సింబల్ కూడా దక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల మొదలు పార్లమెంటు ఎన్నికల వరకు ఒకే గుర్తుపై పోటీచేసే వెసులుబాటు లభించింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ముస్లిం పార్టీగా ముద్ర పడిన మజ్లిస్‌కు సెక్యులర్ గుర్తింపు తీసుకురావడానికి అసదుద్దీన్ యత్నిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని వివిధ పార్టీలకు అందుబాటులో ఉంటూ లిబరల్ నేతగా గుర్తింపు పొందారు. సెక్యులర్ పార్టీ అనే నినాదాన్ని మొత్తం దేశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే దళితులను కలుపుకుపోయే ప్రయత్నం. అసద్ సోదరుడు అక్బరుద్దీన్ తీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. సలావుద్దీన్ ఒవైసీ తరహాలో రోమాలు నిక్కబొడుచుకునే తీరులో ప్రసంగం చేయడంలో దిట్ట. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం అక్బర్ ప్రత్యేకత. గతంలో అక్బరుద్దీన్ చేసిన ఒక ప్రకటన సంచలనంగా మారింది. ఇప్పటికీ ఆయనపై కేసు కొనసాగుతూనే ఉంది. 15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే సత్తా ఏంటో చూపిస్తామంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అన్న అసద్ ఇతర పార్టీలు, నేతలతో సయోధ్యతో ముందుకెళితే.. తమ్ముడు మాత్రం వీరావేశంతో రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తాడని ప్రచారం ఉంది. అసద్ వల్లే ఇప్పుడు ఆ పార్టీ జాతీయ పార్టీగా మారిందంటున్నారు. మొత్తానికి ఆ వర్గానికి ఇప్పుడు ఇదే పార్టీ దిక్కైందనడంలో ఎలాంటి సందేహం లేదంటారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version