అఫ్గానిస్తాన్(Afghanistan) లో తాలిబన్ల రాక్షస పాలన సాగుతోంది. ఎటు చూసినా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వారిలోని కాఠిణ్యాన్ని గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు. మహిళలపై వారు చేసే దమనకాండను మరిచిపోలేకపోతున్నారు. మహిళలంటే వారికి గౌరవముండదు. పైగా వారిపై ద్వేషం పెంచుకుని అంతమొందించేందుకు ముందుకు కదులుతారు. అత్యంత క్రూరమైన మృగాలుగా ప్రవర్తిస్తారు. మానవత్వం మచ్చుకైనా కనిపించదు. ఆడవారిని కనీసం మనుషులుగా కూడా గుర్తించరు. కేవలం పిల్లల్ని కనిపెట్టే యంత్రాలుగా మాత్రమే గుర్తిస్తారు. మహిళలు ఉద్యోగాలు చేయకూడదు. బయటకు వెళ్లకూడదు. దీంతో తాలిబన్ల ఆగడాలపై అందరు భయపడుతున్నారు.మహిళలను చంపి కుక్కలకు విసిరేస్తున్నారని వాపోతున్నారు.
అఫ్గనిస్తాన్ లో తాలిబన్ల చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన ఓ మహిళ తన అనుభవాలను పంచుకుంది. వారి చేష్టలను ప్రత్యక్షంగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఖతెరా(Khatera) అనే 33 ఏళ్ల మహిళ అఫ్గనిస్తాన్ లో ఘాజ్ని ప్రావిన్స్ కు చెందింది. ప్రస్తుతం ఢిల్లీలో తన భర్త, చంటి బిడ్డతో కలిసి నివసిస్తోంది. వైద్య చికిత్స కోసం గత ఏడాది ఢిల్లీకి వచ్చిన ఆమె మరికొద్ది రోజుల్లో అఫ్గాన్ తిరిగి వెళ్తామని భావిస్తున్న తరుణంలో తాలిబన్ల దురాక్రమణ జరిగింది.
అఫ్గాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అక్కడి దయనీయ పరిస్థితిని తలుచుకుని కుమిలిపోతోంది. గత ఏడాది అక్టోబర్ లో రెండు నెలల గర్భిణి. కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో తాలిబన్లు అడ్డుకుని దాడి చేశారు. ఖతెరాపై తాలిబన్లు, ముజాహిదీన్ లు కాల్పులు జరిపారు. ఆమె శరీరంలోకి 8 బుల్లెట్లు దూసుకుపోయాయి. ఒళ్లంతా కత్తిపోట్లు పొడిచారు. అయినా వారిలో సైకో సంతృప్తి పొందలేదు. కత్తితో కళ్లు పొడిచారు. దీంతో ఖతెరా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వదిలేసి వెళ్లిపోయారు. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది.
మహిళలు ఆస్పత్రిలో పురుష వైద్యులను కలవరాదు. ఆడవారిని చదువుకోనివ్వరు. ఉద్యోగం చేయడానికి ఒప్పుకోరు. కేవలం బిడ్డలను కనిపెట్టే యంత్రాలుగా ఉండాల్సిందే. ఇరవై ఏళ్లలో ఎన్నో కలలు కన్నామని ఖతెరా కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వంలో పనిచేసే మహిళలను వెంటాడి చంపే వారని ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు ముస్లిం సమాజానికే కళంకం తెచ్చారని గుర్తు చేశారు. అఫ్గాన్ లో తాలిబన్ల చేతిలో అల్లాడిపోతున్న ప్రజలను అల్లాయే కాపాడాలని కోరారు.