తెలంగాణలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత ఆరేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ దే హవా నడిచింది. అయితే కొంతకాలంగా టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ సీట్లు సాధిస్తోంది.
దీంతో టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాలన్నీ బీజేపీ వైపు చూస్తున్నారు. ఇతర పార్టీల నేతలంతా బీజేపీలో చేరుతుండటంతో ఆపార్టీలో జోష్ నెలకొంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే టాక్ విన్పిస్తోంది.
తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో టీఆర్ఎస్ లో సీఎం మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. గతంలోనూ పలుమార్లు కేటీఆర్ కు త్వరలోనే పట్టాభిషేకం జరుగనుందనే ప్రచారం జరిగింది.
ప్రస్తుతం మరోసారి కేటీఆర్ పట్టాభిషేకం తెరపైకి వచ్చింది. దీనిపై తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తనదైన శైలిలో సీఎం కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు.
దుబ్బాకలో హరీష్ రావుకు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్‌కు.. నిజామాబాద్‌లో కవితకు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పారన్నారు. సీఎం కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారనే కారణం చూపుతూ మార్చిలో కొడుకుకు పట్టాభిషేకం చేసేందుకు సిద్ధమవుతున్నారని జోస్యం చెప్పారు.
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయినా బీజేపీని గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. 2023లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.