
ఈ నడి ఎండాకాలంలో ఏపీలో హిట్ పుట్టే వార్త ఒకటి బయటకు వచ్చింది. భానుడు భగభగ మండే మే నెలలోనే ఏపీ సీఎం జగన్ విశాఖ నుంచి తన పరిపాలనను షూరు చేయబోతున్నాడట.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 6 నుంచి విశాఖపట్నంలోని తన కొత్త క్యాంప్ కార్యాలయం నుంచి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
ముహూర్తం ఇప్పటికే ఖరారు చేశారని.. ఈ మేరకు జగన్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. దానిపై వెనక్కితగ్గే అవకాశమే లేదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్రతో జగన్ ఇటీవల సమావేశం అయిన తరువాత జగన్ ఈ ముహూర్తం ఖరారు చేశారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.
మూడు రాజధానుల విషయం ఇంకా తేలకపోవడం.. కోర్టుల్లోనే ఉన్నా కూడా ఏమాత్రం ఆలస్యం చేయవద్దని.. తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖపట్నంకు ఖచ్చితంగా మే వరకు మార్చాలని జగన్ నిర్ణయించుకున్నట్లు అధికారులకు సమాచారం కూడా పంపారట.. “సాంకేతికంగా కోర్టులు నిర్ణయం తీసుకునే వరకు రాజధాని అమరావతిగా కొనసాగుతుంది. కానీ అది విశాఖపట్నం నుంచి పనిచేయకుండా నన్ను ఆపదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పనిచేయవచ్చు. సిఎం ఎక్కడ నుండి పనిచేస్తున్నా, పరిపాలన కూడా అదే స్థలం నుంచి పనిచేస్తుంది, ”అని జగన్ అధికారులతో న్యాయపరమైన చిక్కుల గురించి కుండబద్దలు కొట్టినట్టు సమాచారం.
జగన్ తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖపట్నంకు మార్చడంలో న్యాయపరమైన సమస్యలను పరిష్కరించే బాధ్యతను అధికారులకు వివరించినట్లు తెలిసింది. “హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా – న్యాయస్థానాలు అమరావతిలో ఉండనివ్వండి – వారి తుది తీర్పు ఇవ్వనీయండి.. కానీ మే 6 తరువాత ఏ అధికారి సచివాలయానికి వెళ్లకూడదు. ప్రతి ఒక్కరూ విశాఖపట్నంలో అందుబాటులో ఉండాలి”అని జగన్ ఆదేశించారట..
మే 6 నుండి వైజాగ్‌లోని వారి కార్యాలయాల్లో అధికారులంతా సిద్ధంగా ఉండాలని.. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను జగన్ కోరినట్లు సమాచారం. ఉద్యోగులందరూ విశాఖపట్నంకు వెళ్లాలని.. వారి పిల్లలకు బస, పాఠశాల.. కళాశాలు, ఇతర సౌకర్యాల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. “ఎట్టి పరిస్థితులలో విశాఖపట్నంకు మారడం వల్ల ఉద్యోగులలో ఎటువంటి అసంతృప్తి ఉండకూడదు” అని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం.