సినీ పరిశ్రమలో ఐటీ దాడులు కలకలం రేపాయి. ప్రముఖ హీరోయిన్ తాప్సితోపాటు మరో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇళ్లు, ఆస్తులపై ఈ దాడులు జరిగాయి.అయితే దీనిపై అధికారికంగా బయటకు చెప్పడం లేదు.
తాజా సమాచారం ప్రకారం.. ముంబైలోని తాప్సికి చెందిన రెండు నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పన్ను ఎగవేతకు సంబంధించి ఈరోజు ముంబై, పూణేల్లో దాదాపు 20 నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో తాప్సితోపాటు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నిర్మాత మధు మంతెన కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అనురాగ్ ఫాంటమ్ ఫిలింస్ లావాదేవీలపై ఈ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఇక వీరే కాదు.. నిర్మాత విక్రమాదిత్య మోత్వానె, నిర్మాత వికాస్ బాల్ నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగినట్లు సమాచారం.
ట్విస్ట్ ఏంటంటే తాజాగా దర్శకుడు అనురాగ్ తోపాటు హీరోయిన్ తాప్సిలు రైతుల ఆందోళనకు మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే వీరి ఇళ్లపై దాడులు జరగడం చర్చనీయాంశంగా మారిందని బాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.