
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఏకగ్రీవాలంటూ.. ప్రజలు వైసీపీకి నీరాజనం పలుకుతున్నారు. టీడీపీలో ఇమడలేక చాలామంది పార్టీని వదులుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి పరిరక్షణ ఉద్యమం విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి మరోసారి యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచి ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న టీడీపీ.. అందులోంచి బయట పడడానికి దారులు అన్వేషిస్తోంది. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అమరావతి ఎజెండాను తాత్కాలికంగా పక్కన పెట్టేసిందని పలువురు అంటున్నారు. అమరావతి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తే.. భారీ ఎదురుదెబ్బ తగలక తప్పదనే భావన టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 9వ తేదీన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకుంటోంది. ఎందుకంటే.. 2018లో తన హయాంలో నిర్వహించలేని స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇప్పడు జగన్ ప్రభుత్వం హయాంలో రావడంతో.. చాలెంజ్ గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తోంది. ఎప్పటికైనా జరిగే ఎన్నికలే కావడంతో .. ఆ ప్రక్రియ ఏదో తాను నియమించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. హయాంలో పూర్తి అయ్యేలా.. చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడ్డారని వైసీపీ నేతలు అంటున్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ చేసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం.. కన్నా.. ఆయన హయాంలోనే పూర్తికావాలన్న పట్టుదల టీడీపీ నేతల్లో నెలకొని ఉందని ఏపీ ప్రజలు అంటున్నారు.
అమరావతి ఉద్యమానికి చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు చుక్కానిగా మారారనడంలో సందేశాలు అక్కరలేదు. చంద్రబాబు సారథ్యం వహిస్తున్నందునే.. ఈ ఉద్యమం 400 రోజులకు పైగా సజీవంగా ఉంటూ వచ్చిందని పలువురు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంత రైతులకోసం చంద్రబాబు నాయుడు జోలె పట్టడాన్ని దీనికి ఉదాహరణగా మరికొందరు చూపించారు. అలాంటి చంద్రబాబు.. ఆయన పార్టీ నాయకులు ఇప్పుడు ఉద్యమం నుంచి తప్పుకున్నారని.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అమరావతి జోలికి వెళ్లడం లేదని అంటున్నారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా టీడీపీ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. ఇప్పటి వరకు ఎవరూ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయలేదని.. ప్రజలను మభ్య పెట్టేందుకే చంద్రబాబూ మేనిఫెస్టో డ్రామా తెరపైకి తెచ్చారని పలువురు అంటున్నారు. అయితే చంద్రబాబు మానస పుత్రికగా భావించే రాజధాని అమరావతికి చోటు దక్కకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. అమరావతి కొనసాగింపుపై కానీ.. ఆ ప్రాంత ఉద్యమానికి న్యాయం చేసేలా లేదా.. రాజధాని తరలనివ్వకుండా ఒత్తిళ్లను తీసుకొస్తామని మేనిఫెస్టోలో ఎక్కడా పొందుపర్చలేదు.
గ్రామ స్థాయిలో పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు.. అమరావతి ఉద్యమానికి ఏ మాత్రం సంబంధం లేదనే వాదన కూడా లేకపోలేదు. అదే విధంగా అమరావతి గ్రామాల్లోనూ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో అమరావతి తరలకుండా అడ్డుకుంటానని ఎందుకు భరోసా ఇవ్వలేదని వైసీపీ నేతలు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు.