Homeఅత్యంత ప్రజాదరణవీళ్ళింతేనా? ఎప్పటికీ మారరా?

వీళ్ళింతేనా? ఎప్పటికీ మారరా?

తెలుగు రాష్ట్రాలు ఎందుకనో ఎప్పుడూ కొన్ని విషయాల్లో వివాదాలు సృష్టిస్తూనే ఉంటాయి. మనం మారమా ? మనమింతేనా? ఎన్నాళ్లిలా? గత మూడు రోజులనుండీ జరుగుతున్న తతంగం చూస్తుంటే మనమింతేనేమో ననిపిస్తుంది. ప్రధానమంత్రి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించి కొన్ని గంటలు కాకముందే సామాజిక దూరం అనేమాటకి అర్ధంలేకుండా చేయగలిగాము మనం. మొన్న ప్రధానమంత్రి మాట్లాడకముందే తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీరు సామాజిక దూరం పాటించకపోయినా , రోడ్లమీద తిరిగినా చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఏం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులివ్వాలా అని కూడా మాట్లాడాడు. అందరూ కెసిఆర్ మాట్లాడిన దానికి జేజేలు పలికారు. మరి ఆ తర్వాత ఏమైంది?

ఆంధ్ర విద్యార్థుల ప్రహసనం మొదలయ్యింది. అసలు ఎక్కడివాళ్ళక్కడ గప్ చిప్ అని ప్రభుత్వ ఉత్తర్వులుంటే అన్నివందలమంది పోలీస్ స్టేషన్ల ముందు గుమికూడటమేమిటి? దానికి ఎవరు కారణం? దీనికి ప్రధానంగా పోలీసులనే నిందించాల్సి ఉంటుంది. అసలు పోలీసులు పాసులు ఎందుకు ఇవ్వటం మొదలు పెట్టారో ఎవరికీ అర్ధం కావటంలేదు. హాస్టళ్లు ఖాళీ చేయిస్తే ప్రభుత్వం తోటి, హాస్టల్ యాజమాన్యం తోటి మాట్లాడాలి గానీ ఏకంగా పాసులు ఇవ్వటం నిబంధనలు అతిక్రమించటం కాదా? కంచె చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలి? లాక్ డౌన్ ని అమలు చేయాల్సిన యంత్రాంగమే దాన్ని అతిక్రమించటానికి దోహదపడే పరిస్థితుల్ని సృష్టిస్తే ఎలా? అంతమంది ఒకర్నొకరు రాసుకుంటూ అన్నిగంటలు పోలీస్ స్టేషన్ల ముందు గుంపులు గుంపులుగా గుమికూడటం సామాజిక దూరం నిబంధనల్ని అతిక్రమించటం కాదా? మరి దీనికి కారణమైన వారిమీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? అదే ఒక సామాన్యుడు అతిక్రమిస్తే లాఠీలతో బాదేవాళ్ళు వాళ్ళే తప్పుచేస్తే శిక్షలేదా? అన్ని శేష ప్రశ్నలే?

మోడీ గారు జనతా కర్ఫ్యూ పెట్టేముందు రెండురోజులు ముందుగా దేశ ప్రజలకు విజ్ఞాపన చేశాడు. కానీ ౩ వారాల లాక్ డౌన్ చేసేముందు ఎటువంటి ముందస్తు అవకాశం ఇవ్వలేదు. మనదేశంలో ఇతర రాష్ట్రాలనుంచి వలస వచ్చి పనిచేసే అసంఘటిత కార్మికుల సంఖ్య చాలా అధిక శాతం లో వుంది. అందులో చాలామంది రెక్కాడితే డొక్కాడని వాళ్ళు . అంతమంది వేరే వూళ్ళో తలదాచుకోవటం తలకుమించిన భారం. సామాజిక దూరం పాటించటం వీళ్ళకు కష్టం కూడా. ఎంతోమంది తాత్కాలిక వసతులలో తలదాచుకుంటారు. మరి తగినసమయం లేకుండా వున్నఫలాన ఎక్కడివాల్లక్కడ గప్ చిప్ అంటే ఎదురయ్యే ఇబ్బందుల్ని ఆలోచించి వుండ వలసిందని అనిపిస్తుంది. వీళ్ళకు ఇక్కడ రేషన్ కార్డులు కూడా వుండవు. దేశంలో ఎక్కడయినా రేషన్ కార్డులు వాడుకొనే సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎందుకనో ఎక్కడో లోపం వుందనిపిస్తుంది. ఇంకొంచెం నిశిత పరిశీలన చేసి వుంటే బాగుండేదేమో. అయినా ఇప్పుడేమీ మాట్లాడవద్దు. అందరం ప్రభుత్వ ఆదేశాల్ని పాటిద్దాం.

విద్యార్థులు కూడా తక్కువేమీ తినలేదు. ఇంటికెళ్లాలని కోర్కె ఉండటం సహజమే. మామూలుగానే రెండు రోజులు సెలవులొస్తే ఇంటికెళ్ళేవాళ్ళు 3 వారాలు ఒట్టిగా గదిలో కూర్చోమని అంటే కష్టమే. వాళ్ళ బాధ అల్లా ఇన్నిరోజులు ఒకే చోట ఉండాల్సి వచ్చేటప్పుడు నేరుగా వూరికెళ్తే బాగుండేదనేది. అంతవరకూ తప్పులేదు. ఒకటి రెండురోజులు ముందుగా ప్రకటించి వుంటే అందరూ ఇళ్ళకు చేరే వాళ్ళే. వాళ్ళ బాధ అర్ధం చేసుకోగలం కానీ అందుకోసం హాస్టళ్ళు మూసివేశారనే సాకు కరెక్టుగా లేదు. ఏవో కొన్ని హాస్టళ్ళు మూసివేసినమాట నిజమే కానీ పోలీస్ స్టేషన్ ముందు కొచ్చిన వాళ్ళలో చాలామంది అటువంటిదేమీ లేకపోయినా ఎలాగోలాగా ఆంధ్ర చేరాలనేదే. ప్రభుత్వం ముందస్తు అవకాశం ఇవ్వకపోవటం ఎలా తప్పో నిబంధనలు అతిక్రమించి ఆంధ్ర వెళ్ళా లనుకోవటం కుడా అంటే తప్పు. వలస కార్మికుల్లో ఎక్కువమంది చదువుకోని వాళ్ళు , వాళ్ళ బాధల్ని కొంతమేర అర్ధం చేసుకోగలంకానీ విద్యార్ధులు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించటం బాధాకరం.

అసలు మన దేశంలో ఎవరినీ ఏమీ అనటానికి లేదు. ఎవరూ చిన్న అసౌకర్యాన్ని కూడా భరించలేరు. అందరం పెద్ద పెద్ద మాటలే చెబుతాం. సినిమా హాల్లో జాతీయగీతం వస్తే లేచి నిలబడతాం. దేశభక్తి సినిమాలు వస్తే ఆదరిస్తాం. అదే వ్యక్తిగతంగా తన దగ్గర కొచ్చేసరికి మన సౌకర్యాలలో ఎక్కడా రాజీపడటానికి ఇష్టపడం. ఇప్పుడు వచ్చింది ఓ జాతీయ విపత్కర పరిస్థితి. ఇందులో అందరూ సహకరిస్తేనే ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడగలం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన కొంతమందికి అసౌకర్యం కలగవచ్చు. అంతమాత్రాన ఈ సమయంలో వాటిని అతిక్రమించటానికి ప్రయత్నించటం క్షంతవ్యం కాదు. విద్యార్ధులు ఊరికెళ్ళ గలిగితే మంచిదే. అదికుదరనప్పుడు దొడ్డి మార్గాలు వెతుక్కోవటం తప్పు. అదీ సామాజిక దూరం నియమాన్ని అతిక్రమించి. ఇందుకు కావాల్సిన భౌతిక పరిస్థితుల్ని సృష్టించిన పోలిసుల ప్రవర్తన గర్హనీయం.

ఇందులో రెండు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కూడా గర్హనీయం. సామాజిక దూరం అమలులో వున్నప్పుడు, లాక్ డౌన్ అమలు లో వున్నప్పుడు సమస్య ఉత్పన్నం అయినప్పుడు యుద్ధ ప్రాతిపదికలో పరిష్కరించాలి కానీ అది అదుపుతప్పే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇప్పుడు జరిగిన మొత్తం ప్రహసనం లో ఎక్కువ ఆందోళన చెందుతుంది సామాజిక దూరం విషయంలో జరిగిన ఉల్లంఘనల వలన ప్రమాదం జరిగిందా అనేదే? టీవీ లలో అంత పెద్ద ఎత్తున విద్యార్ధులు పోలీస్ స్టేషన్ ల ముందు గుమికూడితే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించక పోవటం రెండు రాష్ట్రాల లోపం. అయినా ఇప్పుడా విషయం కూడా వదిలేద్దాం. ఇది సమయం కాదు. ఈ రోజు కూడా సరిహద్దుల దగ్గర మొహరించటాన్నిఏ కోణంలో చూడాలి? వీళ్ళ వైఖరిని ఖండించాలి. ప్రభుత్వాన్ని విమర్శించటానికి అందరం ముందుంటాం కానీ మనమే భాద్యతలేకుండా ప్రవర్తిస్తుంటే ఎలా? కరోనా మహమ్మారిని పారదోలాలంటే అందరం ప్రభుత్వ ఆదేశాల్ని పాటించాలి. ఇది యుద్ధం లాంటిదే. యుద్ధంలో కమాండర్ ఆదేశాల్ని తూచాతప్పకుండా పాటించాలి. అందులో యోగ్యతల్ని చర్చించరు. ఇదీ అంతే. ఈ ౩ వారాలు ప్రభుత్వ ఆజ్ఞల్ని ఎవరూ ఉల్లంఘించ రాదు. ప్రభుత్వ నిర్ణయం తప్పా ఒప్పాఅనేది యుద్ధం అయిపోయిన తర్వాత అంటే మహమ్మారిని జయించిన తర్వాత తీరికగా చర్చించుకుందాం. అప్పటిదాకా ప్రభుత్వ ఆజ్ఞల్ని శిరసావ హించుదాం . జై భారత్ , జయహో మన ఐక్యత.

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.
RELATED ARTICLES

Most Popular