ఒకప్పుడు ఆకలేస్తే ఆకాశం వైపు.. దాహం వేస్తే భూమివైపు చూసేంత కఠిన మెట్టప్రాంతం అదీ. వర్షాలు పడితేనే పంటలు పండేవి.. లేకపోతే ఆ ఏడు సాగు వదలుకోవాల్సిందే.. ఒక్క ప్రాజెక్టు లేదు.. ఒక్క కాలువ లేదు. వానలు పడకపోతే కరువు ప్రాంతాన్ని తలపిస్తుంటుంది. కానీ ముగ్గురు దీక్షా పరుల వల్ల ఇప్పుడు మెట్టప్రాంతం కాస్తా జలసిరితో కళకళలాడుతోంది. ఎండమావిలో నీటిజాడను తెప్పిస్తోంది.
సిరిసిల్ల, సిద్దిపేట, హుస్నాబాద్.. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లోని నియోజకవర్గాలివీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మెట్టప్రాంతంగా ఉన్న రాయలసీమలోని అనంతపురంను ఈ నియోజకవర్గాలు ఒకప్పుడు తలపించేవి. అలాంటి చోట సిద్దిపేటకు హరీష్, సిరిసిల్లకు కేటీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రులు కావడంతోపాటు కేసీఆర్ కాళేశ్వరం సంకల్పం తెలంగాణ దశనే మార్చేసింది. ఇప్పుడు కాశేళ్వరం ప్రాజెక్టుతో జలకళను ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు సంతరించుకున్నాయి.
కరువుకు కేరాఫ్ అడ్రస్ గా సిరిసిల్ల, సిద్దిపేట, హుస్నాబాద్ లు ఉండేవి. ఇక్కడ సగటున ఏప్రిల్, మే నెలల్లో భూగర్భ జలాలు 27 మీటర్ల లోతునకు చేరేవి. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యాన సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జల మట్టం కేవలం 7-9మీటర్ల పైకి వచ్చాయి. ఇదంతా మిడ్ మానేరు ప్రాజెక్టు చలువే..
ఇక సిద్దిపేటలో నిర్మించిన రంగనాయకసాగర్ లోకి ఇప్పుడు కాళేశ్వరం గోదావరి జలాలు చేరాయి. మిడ్ మానేరు నుంచి అనంతసాగర్ మీదుగా సిద్దిపేటకు నీళ్లొచ్చాయి. మెట్టప్రాంతమైన సిద్దిపేట వాసుల కళ్లల్లో నిజంగా క‘న్నీళ్లు’ వచ్చాయి. కరువుసీమలో కాంతిరేఖను పంచాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా హుస్నాబాద్ కు గౌరవెల్లి సహా ఇతర ప్రాజెక్టులను నింపుతు అక్కడి నియోజకవర్గానికి నీరందిస్తున్నారు.
మొత్తంగా కరువుతో అల్లాడిన కరీంనగర్, మెదక్ జిల్లాల ప్రాంతాలు ఇప్పుడు గోదారమ్మ చల్లని ఒడితో తనివితీర నీటి కరువు తీర్చుకుంటున్నాయి. ఆ జలాలు హైదరాబాద్ వరకు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మరలుతున్నాయి. ఎక్కడి గోదారి ఎక్కడికి వచ్చిందని ప్రజల్లో ఆనందభాష్పాలు రాలుతున్నాయి. గోదారమ్మకు కేసీఆర్ లాగే చీరసారే పంచుతున్నారు. కరువునేలపై అంతటి నీటి జాడ చూసి జనం పులకించిపోతున్నారు.