Women Earn Money: మహిళలు భర్త సంపాదించిన ఆదాయంతో కుటుంబాన్ని చక్కగా నడుపుతారు. ఎంత తక్కువ జీతం వచ్చినా కూడా ఖర్చును పోను మిగిలిన దానిని పొదుపు చేసే నేర్పు మహిళలకు మాత్రమే ఉంటుంది. అటువంటి మహిళలు తమ సొంతంగా వ్యాపారం చేసి ఆదాయం సంపాదిస్తే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో మహిళలు విద్యా, ఉద్యోగాలు అలాగే వివిధ రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నారు. కానీ వాళ్లు తమకు ఆర్థిక స్వేచ్ఛ కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆర్థిక అవకాశాల గురించి మహిళలకు ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది. మహిళలు డబ్బుల కోసం ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా డబ్బును సంపాదించుకునే విధంగా అవకాశాలను వెతుక్కోవాలి. ఆర్థికంగా మహిళలు ఎదగడానికి ఉన్న అవకాశాల గురించి వాళ్లు తెలుసుకోవాలి. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా వాళ్లు కూడా తమను తాము మార్చుకోవాలి. ఒకప్పుడు మహిళలు చదువుకోవడానికి పరిమితి అవకాశాలు మాత్రమే ఉండేది. అప్పట్లో అనేక సామాజిక కట్టుబాట్లు కూడా వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేవి. కానీ ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో మహిళలకు చాలా అవకాశాలు ఉన్నాయి. ముందుగా వాటిని వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మహిళలు ముందుగా ఆర్థిక అక్షరాస్యతను పెంచుకోవాలి. వాళ్లు బడ్జెట్, పెట్టుబడులు, రుణ నిర్వహణపై ముందుగా అవగాహన పెంచుకోవాలి. మహిళలకు వీటి గురించి తెలియపరచడానికి వివిధ ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లు మరియు వర్క్ షాప్లు అందుబాటులో ఉన్నాయి.
తమ నైపుణ్యాలకు అనుగుణంగా మహిళలు తమ కెరియర్ను మలుచుకోగలగాలి. ముఖ్యంగా ఆర్థిక ఉన్నతి సాధించడానికి ఇది చాలా కీలక. అలాగే వాళ్ళు జీతాల గురించి చర్చించడం, పదోన్నతులు కోరుకోవడం మరియు నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవడం వంటి అనుకున్న లక్ష్యాలను సాధించాలి. వాళ్లు ఆదాయం సంపాదించడంతోపాటు పొదుపు చేసుకునే అలవాటు కూడా చేసుకోవాలి. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. తమకు వచ్చే ఆదాయంలో ఒక శాతాన్ని ఆదా చేయడం ద్వారా భవిష్యత్తులో పెద్ద మొత్తంలో సంపదను పోగుచేతుకోగలుగుతారు. మహిళలు తమకు వచ్చిన ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన పొదుపును వివిధ మార్గాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా బలమైన ఆర్థిక ప్రగతిని పొందగలుగుతారు.
ఆ పొదుపు చేసిన డబ్బులను మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు తదితర పథకాలలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలాగే మంచి పెట్టుబడిని ఎంపిక చేసుకోవడానికి ఆర్థిక నిపుణులను సంప్రదిస్తే మేలు. ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్లను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మహిళలు పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ చాలా వీలుగా ఉంటాయి. చాలా అనుభవం ఉన్న మేనేజర్లు వీటిని నిర్వహిస్తారు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బును స్టాక్, బాండ్లు మరియు సెక్యూరిటీలలో వాళ్ళు పెట్టుబడిగా పెడతారు. ఈ క్రమంలో మీరు దీర్ఘకాలంలో అత్యధిక సంపాదన పొందే అవకాశం ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న సిప్ అనే విధానంతో మీరు ప్రతినిలా తక్కువ మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు.