Gen Z prefers instant food: ప్రస్తుతం వర్షాకాలం.. అందమైన సాయంత్రం వర్షం పడుతున్న వేళ వేడివేడి మ్యాగీ ని ఆస్వాదించడం.. రాత్రి ఆలస్యంగా పని ముగించుకుని ఒక ప్యాకెట్ రామెన్, స్నేహితులతో కలిసి స్పైసీ కొరియన్ నూడుల్స్ ఛాలెంజ్.. ఇవన్నీ నేటి యువత జీవనశైలిలో భాగమైపోయాయి. ఇవి కేవలం ఆకలి తీర్చే ఆహారంగా కాకుండా, ఇన్‌స్టంట్గా లభించే ఒక ‘కంఫర్ట్ ఫుడ్’గా మారిపోయాయి. అయితే వీటిని మాత్రమే యూత్ ఎందుకు ఇష్టపడుతున్నారు?వీటి వల్ల రాను రాను ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి?
వేగవంతమైన జీవనశైలి, సోషల్ మీడియా ప్రభావం, కొత్త రుచుల ఆకర్షణ కారణంగా ఇన్‌స్టంట్ ఫుడ్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇది కేవలం రెండు నుంచి ఐదు నిమిషాల్లో తయారయ్యే ఈ ఆహారం కావడంతో బిజీ జీవితానికి బాగా సరిపోతుందని భావిస్తున్నారు. హాస్టల్ విద్యార్థులు, ఉద్యోగులు, ఒంటరిగా నివసించే వారు వీటిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా తక్కువ ధరలో అందుబాటులో ఉండటం, విభిన్న రుచులు, మసాలా ఫ్లేవర్లు యువతను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొరియన్ నూడుల్స్ ఛాలెంజ్‌లు, ఫుడ్ వ్లాగ్‌లు కూడా వీటి ప్రాచుర్యాన్ని మరింత పెంచుతున్నాయి.
ఇన్‌స్టంట్ నూడుల్స్ తిన్న వెంటనే రుచికరమైన అనుభూతిని కలిగిస్తాయి. అయితే వీటిలో అధికంగా ఉండే ఉప్పు, శుద్ధి చేసిన పిండి , సంతృప్త కొవ్వులు, ప్రిజర్వేటివ్‌లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. తరచుగా వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సోడియం (ఉప్పు) మోతాదు ఎక్కువగా ఉంటుంది. తరచూ అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఇప్పటికే బీపీ సమస్య ఉన్నవారు వీటిని పరిమితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
కొన్ని అధ్యయనాలు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి క్షీణించడం, మానసిక ఆరోగ్య సమస్యలు, మెదడు పనితీరుపై ప్రభావం ఉండవచ్చని సూచిస్తున్నాయి. అలాగే అధిక కొవ్వులు, చక్కెరలు, కృత్రిమ పదార్థాలు ఉన్న ఆహారం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే డిమెన్షియా లేదా హార్మోన్ల సమస్యలు కేవలం నూడుల్స్ వల్లే వస్తాయని చెప్పడానికి ఇంకా మరింత పరిశోధన అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
బరువు పెరగడం, జీర్ణ సమస్యలు
ఇన్‌స్టంట్ ఫుడ్‌లో కేలరీలు ఎక్కువగా ఉండటం, ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల తరచూ తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. కడుపు నిండిన భావన కలిగించినా, శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల ఆకలి త్వరగా మళ్లీ వేయవచ్చు.
యువతను ఆకర్షిస్తున్న ప్రీమియం, కొరియన్ నూడుల్స్
ఇటీవల మార్కెట్లో ప్రీమియం రామెన్, కొరియన్-శైలి నూడుల్స్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఘాటైన రుచులు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, సోషల్ మీడియా ట్రెండ్‌లు వీటిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ముఖ్యంగా జెన్ Z, మిలీనియల్స్ కొత్త రుచులను ప్రయత్నించడంలో ఆసక్తి చూపుతున్నారు. అందుకే భారత ఇన్‌స్టంట్ నూడుల్స్ మార్కెట్ విలువ బిలియన్ల డాలర్ల స్థాయికి చేరుకుంది.
అయితే ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు బదులుగా గోధుమ నూడుల్స్, మిల్లెట్ (సిరిధాన్యాల) నూడుల్స్, ఓట్స్ ఉప్మా, వెజిటబుల్ పోహా, అటుకుల ఉప్మా, రాగి జావ, పెసర అట్టు వంటి ఆహారాలను ఎంచుకోవచ్చు. ఇవి త్వరగా తయారవడమే కాకుండా ఎక్కువ పోషకాలు అందిస్తాయి. ఒకవేళ నూడుల్స్ తినాలనిపిస్తే వాటిలో క్యారెట్, బీన్స్, క్యాప్సికం, గుడ్డు లేదా చికెన్ వంటి పదార్థాలు కలిపి పోషక విలువను పెంచుకోవచ్చు.
