Homeలైఫ్ స్టైల్Wheat Flour In Fridge: గోధుమ పిండిని ఫ్రిజ్ లో పెడుతున్నారా..

Wheat Flour In Fridge: గోధుమ పిండిని ఫ్రిజ్ లో పెడుతున్నారా..

Wheat Flour In Fridge: నేటి కాలంలో కొన్ని ఆహారపదార్థాలను ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవడం సాధారణమైపోయింది. ఇందులో కూలింగ్ వ్యవస్థ ఉండడం వల్ల కొన్ని పదార్థాలు పాడవకుండా ఉంటాయి. అయితే ఈ కూలింగ్ అన్నింటికి వర్తించవు. చపాతీలు, పూరీలు, పరాటాల కోసం కొందరు గోధుమ పిండిని ముందుగానే కలుపుతుంటారు. అయితే ఈ పిండిని ఫ్రిజ్‌లో నిల్వచేయడం వల్ల పని త్వరగా పూర్తవుతుందని భావిస్తారు. కానీ ఎక్కువసేపు నిల్వ ఉంచిన పిండి ఆరోగ్యానికి మంచిది కాదని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో పిండిని ఎక్కువసేపు ఉంచితే అందులో సూక్ష్మజీవులు వేగంగా పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇలా నిల్వ ఉంచిన పిండితో ఏం జరుగుతుందో తెలుసా?

గోధుమ పిండిలో నీరు కలిపిన వెంటనే రసాయన మార్పులు ప్రారంభమవుతాయి. గాలిలో ఉండే బ్యాక్టీరియా, ఈస్ట్, ఇతర సూక్ష్మక్రిములు తడి వాతావరణంలో వేగంగా పెరుగుతాయి. మొదట్లో కనిపించకపోయినా కొన్ని గంటల తర్వాత పిండిలోని పోషకాలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్లు, సహజ గుణాలు తగ్గిపోతాయని అంటున్నారు.

సాధారణంగా పిండిని కలిపిన తర్వాత రెండు గంటలలోపు వాడితే ఉత్తమమని సూచిస్తున్నారు. ఫ్రిజ్‌లో పెట్టినా గరిష్ఠంగా 24 నుంచి 48 గంటల్లోపు వాడేయాలని చెబుతున్నారు. అయితే ఇది కూడా ఫ్రిజ్ ఉష్ణోగ్రత, పరిశుభ్రత, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వేసవిలో అయితే పిండి త్వరగా పాడయ్యే అవకాశం ఉండటంతో మరింత జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు.

పిండి పాడవుతున్న సంకేతాలను గుర్తించడం కూడా చాలా ముఖ్యం. పిండిలో పుల్లటి వాసన రావడం, రంగు మారడం, పైభాగంలో నల్లటి లేదా ఆకుపచ్చ మచ్చలు కనిపించడం, అతిగా జిగటగా మారడం వంటి లక్షణాలు ఉంటే దానిని వాడకుండా ఉండడమే మంచిది. ఇవి ఫంగస్ లేదా హానికరమైన సూక్ష్మజీవులు పెరిగిన సంకేతాలుగా భావిస్తారు.

పాడైన పిండితో చేసిన చపాతీలు లేదా పూరీలు తింటే జీర్ణసంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

కొంతమంది పిండిని మృదువుగా ఉండేందుకు ఎక్కువసేపు బయటే ఉంచుతుంటారు. కానీ గది ఉష్ణోగ్రతలో పిండిని ఎక్కువసేపు ఉంచడం వల్ల కూడా బ్యాక్టీరియా పెరుగుదల మరింత వేగంగా జరుగుతుంది. అందుకే వెంటనే వాడకపోతే గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలని సూచిస్తున్నారు.

ఫ్రిజ్‌లో ఉంచిన పిండిని వాడేముందు ఒకసారి బాగా పరిశీలించడం మంచిది. వాసన, రంగు, టెక్స్చర్‌లో ఏమైనా మార్పులు ఉంటే వాడకూడదు. అలాగే ఫ్రిజ్‌లో కూడా పిండిని తెరిచి ఉంచకూడదు. అలా ఉంచితే ఇతర ఆహారాల వాసనలు, సూక్ష్మక్రిములు దానిలోకి చేరే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version