Stay Away From These Five Habits: ప్రతి ఒక్కరూ తమ జీవితం బాగుండాలని కోరుకుంటారు. కొందరు యువకుల వయసు నుంచే వివిధ ప్రణాళికలు వేసుకొని వాటికి అనుగుణంగా తమ జీవితం మార్చుకుంటారు. మరికొందరు మాత్రం జీవితంపై అవగాహన లేకపోవడంతో ఇష్టమొచ్చిన రీతిలో ఉంటారు. ఇలాంటి వారి ప్రవర్తన వల్ల వారికే కాకుండా మిగతా వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వారికి ఉండే కొన్ని అలవాట్ల కారణంగా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరు. కొందరు ఈ అలవాట్లు ఉండొద్దు.. మార్చుకోవాలని చెప్పినా వినరు. ఇలాంటప్పుడు వారు నిత్యం కష్టాలను ఎదుర్కొంటారు. అయితే సజ్జనులు మాత్రం తమ తప్పులను తెలుసుకొని వారి జీవితాన్నిమార్చుకుంటారు. ఇంతకీ ఎటువంటి అలవాట్లు ఉండడం వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి? వాటి నుంచి దూరంగా ఉండాలంటే ఏంచేయాలి?
నెగెటివ్:
చాలా మంది ఒక పనిని మొదలు పెట్టే ముందు అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. కానీ కచ్చితంగా ఫెయిల్ అవుతుందని నమ్ముతారు. అంతేకాకుండా వీరి జీవితంలోనే కాకుండా ఇతరుల జీవితాల్లో కూడా తలదూర్చి నెగెటివ్ వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇష్టం కొద్ది మొదలుపెట్టే ఏ పనులను ఇలాంటి వారు పూర్తి చేయరు. ఇలా వీరు ఒక గమ్యాన్ని ఏర్పరుచుకున్నా.. వాటిని పూర్తి చేయడానికి ఈ అలవాటు అడ్డంకిగా మారుతుంది. నెగెటివ్ గా ఆలోచించడం మానేసి అంతా మంచే జరుగుతుంది.. అని అనుకోవడం మంచిది.
ఇతరులతో పోల్చుకుంటూ..
సమాజంలో ఎంతో మంది వ్యక్తుల అలవాట్లు, అభిప్రాయాలు, పనులు భిన్నంగా ఉంటాయి. ఒకరు తమ వాతావరణానికి, వారి పరిస్థితులకు అనుగుణంగా పనులు చేస్తారు. వారు జీవితంలో పైకి రావడం.. లేదా ఫెయిల్ అవడం.. వారి వ్యక్తిత్వానికి సంబంధించినది మాత్రమే. అలాంటి వారిని పోల్చుకుంటూ బాధపడడం మానేయాలి. వారికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి.. తమకు లేవని కుంగిపోవడం కరెక్ట్ కాదు. అలాగే వారు అందంగా ఉన్నారు.. నేను లేను.. అనే ఫీలింగ్ లో ఉండొద్దు. ఎవరి జీవితం వారిదే.. అన్నట్లుగా భావించుకోవాలి.
గతం గతః
కొత్తొక వింత.. పాతొక రోత.. అన్నారు. గతాన్ని తలుచుకుంటే బాధ తప్ప ఏమీ మిగలదు. పాత విషయాలను పక్కనబెట్టి వర్తమానం, వచ్చే జీవితాన్ని గురించి ఆలోచించాలి. వర్తమానం గురించి ఆలోచిస్తే పనులు తొందరగా పూర్తవుతాయి. భవిష్యత్ గురించి ఆలోచిస్తే ఆశలు పుడుతాయి. అందువల్ల గతాన్ని వదిలేని ముందుకు వెళ్లడం మంచిది.
సోమరితనం:
నేటి కాలంలో చాలా మంది యువతలో సోమరితనం ఎక్కువగా ఉంది. ఒకరిపై ఆధారపడడం.. లేదా పూర్వీకుల ఆస్తిని చూస్తూ ఉండడం వంటివి మాత్రమే చేస్తున్నారు. వ్యక్తిగతంగా తాను ఏం చేయాలో? ఎలాంటి విధులు నిర్వహించాలో? నిర్ణయించుకోవడం లేదు.దీంతో జీవితంలో పైకి ఎదగలేరు. ఇలా ఉండడం వల్ల భవిష్యత్ లో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటారు.
అసూయ:
ఓ సినిమాలో ‘మనం బాగుపడకపోయినా పర్వాలేదు.. పక్కోడు నాశనం కావాలి’ అనే డైలాగ్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇది సినిమాలోనిదే అయినా నిజ జీవితంలో చాలా మందిలో ఈ గుణం ఉంటుంది. తమ పనిని గురించి ఆలోచించేవారికన్నా.. పక్కోడి గురించి ఆలోచించేవారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారి వల్ల వారు మాత్రమే కాకుండా ఇతరులు కూడా నష్టపోతున్నారు. ఇలాంటి గుణాన్ని పక్కనబెట్టండి.