PM Vishwakarma Yojana: చేతి వృత్తుల వారికి ఆర్థికంగా చేయూతనందించాలనే ఉద్దేశంతో కేంద్రం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. కరోనా సమయంలో చిరు వ్యాపారుల రుణాలు అందించి ప్రోత్సహించింది. తాజాగా చేతి వృత్తుల వారి కోసం పీఎం విశ్వకర్మ యోజన పథకం అమలు చేస్తోంది. 2023, సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్రమోదీ దీనిని ప్రారంభించారు. తెలంగాణలో అసెంబ్లీ కోడ్ అమలులో ఉండడంతో దీనిని అమలు చేయలేదు. తాజాగా దీనిని తెలంగాణలో అమలుచేస్తున్నారు.
వీరు అర్హులు..
– పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద వడ్రం గులు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు, నాయీబ్రాహ్మణులు, రజకులు, చేపల వల తయారీదారులు, మాలలు అల్లేవారు, మే స్త్రీలు, గంపలు, చాపలు, చీపుర్లు తయారు చేసేవారు, చర్మకారులు, చెప్పుల తయారీదారులు, తాళాలు, ఆయుధ, కవచ తయారీదారులు.. ఇలా 18 రకాల వృత్తులవారు అర్హులు. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇక పీఎం ఈజీపీ, ముద్ర వంటి పథకాలతో లబ్ధి పొందనివారై ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుంది.
దరఖాస్తు ఎలా…
అర్హులైనవారు ఆధార్ కార్డు, లింక్ అయిన మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, రేషన్‌కార్డు జిరాక్స్ ప్రతులతో మీసేవ, సీఎస్సీ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. బయోమెట్రిక్ ద్వారా దరఖాస్తు చేస్తే ఆధార్‌కు లింక్ ఉన్న ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. తద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆపై గ్రామస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో మెప్మా అధికారులు చేపడతారు.
ఎంపికైనవారికి శిక్షణ..
ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ఎంపిక అయిన వారిఇ ఐదు రోజులపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో రోజుకు రూ.500 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ అనంతరం 15 రోజలు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్, ఆ తరువాత రూ.15 వేల విలువైన టూల్ కిట్ అందిస్తారు.
రూ.లక్ష రుణం..
ఇక దరఖాస్తు దారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 5 శాతం వడ్డీతో రూ.లక్ష రుణం ఇస్తారు. ఈ రుణాన్ని వాయిదాల్లో చెల్లించాలి. 18 నెలల వాయిదాల్లో చెల్లిస్తే తిరిగి 5 శాతం వడ్డీతో మరో రూ.2 లక్షల వరకు రుణం పొందవచ్చు. అయితే ఈ పథకంపై చాలా మందికి అవగాహన లేదు.