T20 World Cup 2022- India vs Bangladesh: విరాట్ కోహ్లీ, రాహుల్, సూర్య కుమార్ యాదవ్ ఈ ముగ్గురు ఆడటం వల్ల భారత్ 185 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కానీ చేజింగ్ దిగిన బంగ్లా జట్టు ఎదురుదాడినే అస్త్రంగా ఎంచుకుంది. లిటన్ దాస్ తుఫాన్ ఇన్నింగ్స్ తో 7 ఓవర్లకు వికెట్లు ఏమీ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. బౌలర్లు పోటీపడి పరుగులు ఇస్తున్న వేళ ఉశమనం ఇచ్చేందుకు వచ్చాడా అన్నట్టుగా వరుణుడు వర్షం కురిపించాడు. వర్షం అసలు ఆగేలా కనిపించలేదు. అక్కడితో ఆట ఆగిపోతే భారత్ కథ ముగిసిపోయేదే. అప్పటికే డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 17 పరుగుల ముందంజలో ఉంది బంగ్లాదేశ్. వర్షం విడవకుంటే భారత్ ఖాతాలో మరో ఓటమి జమ అయ్యేది. సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యేవి. కానీ వరుణుడు శాంతించాడు.. ఇదాకా మంచి ఊపులో ఉన్న బంగ్లాదేశ్ విరామం తర్వాత తడపడింది. భారత బౌలర్లు పుంజుకోవడంతో ప్రత్యర్థి జట్టు తుదికంటా పోరాడింది. కానీ విజయం మనల్ని వరించింది. మధ్యలో మైదానాన్ని ముంచేత్తుతున్నప్పుడు వర్షాన్ని తిట్టుకున్న భారత అభిమానులు.. చివరకు కృతజ్ఞతలు చెప్పుకునే ఉంటారు. ఎందుకంటే పంగ్లా పూర్తి లయ తప్పింది. భారత్ వైపు మ్యాచ్ మొగ్గింది వర్షం తర్వాతే. లిటన్ దాస్ రన్ అవుట్ కావడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.

అడిలైడ్ లో జోరు వర్షానికి ముందు భారత జట్టుపై పిడుగు పడింది. ఆ పిడుగు పేరు లిటన్ దాస్. భారత బౌలర్లపై ఈ మధ్యకాలంలో ఏ బ్యాటరూ చేయని రీతిలో ఎదురు దాడికి దిగాడు. భారీ లక్ష్య చేదనలో బంగ్లాకు ఎలాంటి ఆరంభం కావాలో అదే ఇచ్చాడు. మబ్బులు కమ్మి ఉండటంతో ఏ క్షణాన అయినా వర్షం కురిసే అవకాశం ఉండవచ్చనే అంచనాతో డ/లూ విధానంలో ముందు ఉండాలనే యోచనతో అతడికి విధ్వంసం సృష్టించే బాధ్యత అప్పగించింది. జట్టు కోరుకున్నట్టు గానే అతడు చెలరేగిపోయాడు. భువి, ఆర్శ్ దీప్, షమీ ఇలా ఎవరినీ లెక్క పెట్టలేదు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సర్లు, ఫోర్లు బాదాడు. పవర్ ప్లే ముగిసే నాటికి బంగ్లా స్కోరు 60. అందులో లిటన్ వాటా 50 పరుగులు అంటే అతడు ఏ స్థాయిలో చెలరేగి పోయాడో అర్థం చేసుకోవచ్చు. అయితే వర్షం అతడి జోరుకు అడ్డు కట్ట వేసింది. ఆ సమయానికి డక్ వర్త్ లూయిస్ విధానం లో బంగ్లా నే గెలిచే స్థితిలో ఉంది. వాన జోరు పెరగడంతో అభిమానుల్లోనూ టెన్షన్ నెలకొంది .
ఆట ప్రారంభం కావడంతో
వాన తగ్గాక ఆట మొదలయింది. తర్వాత 9 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సి రావడం ఏమంత కష్టం అనిపించలేదు. కానీ ఆట మొదలయ్యాక బంగ్లా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. లిటన్ రన్ అవుట్ అయ్యాడు. నజ్మూల్ శాంటో షమీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అర్ష్ దీప్ ఒకే ఓవర్ లో అసీఫ్, షకీబ్ ను అవుట్ చేశాడు. హార్దిక్ తర్వాత ఓవర్ లో యాసిర్ అలీ, మొసాదెక్ లను బుట్టలో వేసుకున్నాడు. అప్పటికి 13 ఓవర్లకు బంగ్లా స్కోర్ 108/6. మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపుతుండగా.. చివరి 3 ఓవర్లలో 43 పరుగులు చేయాల్సి వచ్చింది.

ఇక మ్యాచ్ సొంతం అయినట్టే అనుకుంటుండగా నురుల్, తస్కిన్ ధాటిగా ఆడి బంగ్లాను మళ్లీ రేసులోకి తెచ్చారు. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. అర్శ్ దీప్ 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ భారత్ వశమయింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్ అభిమానులను సీటు చివరి అంచులో కూర్చో బెట్టింది.