Fast Eating Risks: నేటి కాలంలో చాలా మందిది ఉరుకులు, పరుగుల జీవితం.. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు తమ కార్యాకలపాలు సక్రమంగా నిర్వహించడానికి బిజీగా మారిపోతున్నారు. ఈ క్రమంలో సరిగ్గా కూర్చొని తినడానికి కూడా సమయం దొరకడం లేదు. అయితే దొరికిన కొద్ది సమయంలో పని ఒత్తిడి, టైమ్ మేనేజ్మెంట్ కారణంగా వేగంగా తినడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారాన్ని త్వరగా మింగేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సరిగా అందకపోవడమే కాకుండా, జీర్ణక్రియపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
వేగంగా ఆహారం తినేవారు ఆహారాన్ని నమలకుండానే మింగేస్తూ ఉంటారు. ఆహరం కడుపులోకి వెళ్లిన తరువాత కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరడానికి కొంత సమయం పడుతుంది. వేగంగా తినేటప్పుడు ఈ ప్రక్రియకు సమయం దొరకదు. ఫలితంగా మనకు తెలియకుండానే అవసరానికి మించి తినేస్తాం. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీంతో అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వల్ల క్రమంగా బరువు పెరుగుతారు. ఈ పరిస్థితి కొనసాగితే అది ఊబకాయంగా మారే ప్రమాదం ఉంది.
అంతేకాదు ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వల్ల జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. నోరులోనే ఆహారం మెత్తగా అయ్యే ప్రక్రియ సరిగ్గా జరగకపోతే, కడుపుపై అదనపు భారం పడుతుంది. దీని కారణంగా అజీర్ణం, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే శరీరంలో కొవ్వు పేరుకుపోయి మెటబాలిజం కూడా దెబ్బతింటుంది.ఈ అలవాటు వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యలను నివారించాలంటే ఆహారం తినే విధానంలో మార్పులు అవసరం. ప్రతి ముద్దను నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. కనీసం 20 నుంచి 30 సార్లు నమిలితే జీర్ణక్రియ సులభమవుతుంది. అలాగే తినేటప్పుడు మొబైల్, టీవీ వంటి వాటిని దూరంగా ఉంచి, పూర్తిగా ఆహారంపై దృష్టి పెట్టాలి. ఇది మనకు తక్కువ ఆహారంతోనే తృప్తి కలిగేలా చేస్తుంది. వేగంగా తినడం చిన్న అలవాటులా కనిపించినా, దీని ప్రభావం చాలా పెద్దది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నెమ్మదిగా, జాగ్రత్తగా తినడం చాలా ముఖ్యం. చిన్న మార్పులు చేసుకుంటే పెద్ద సమస్యలను సులభంగా దూరం పెట్టవచ్చు.