Parents with children : తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. వాళ్లకి కావాల్సినవి అన్ని ఇస్తూ వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అయితే కొన్నిసార్లు కోపంలో ఏదో తెలియక పిల్లలను సూటిపోటి మాటలతో బాధపెడతారు. ఎంత ప్రేమగా చూసుకున్న ఆ ప్రేమ పిల్లలకు గుర్తుండదు. కానీ తిట్టిన ఆ మాటలనే పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. సాధారణంగా కొందరు పిల్లలు ఎన్ని మాటలు అన్నా కూడా తట్టుకుంటారు. కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులు అనే మాటలు పిల్లలను చాలా బాధపెడతాయి. మా పేరెంట్స్ నన్ను ప్రేమించడం లేదు. ఏదో ఇన్ని రోజులు ప్రేమ ఉన్నట్లు నటించారని పిల్లలు భావిస్తారు. ఎంత కోపంగా ఉన్నా కూడా తల్లిదండ్రులు పిల్లలను కొన్ని మాటలు అనకూడదు. మరి ఆ మాటలేంటో తెలుసుకుందాం.
ఇతర పిల్లలతో పోల్చడం
చాలామంది తల్లిదండ్రులు చేసే ఫస్ట్ తప్పు ఇతర పిల్లలతో పోల్చడం. ఇంట్లో లేదా బయట పిల్లలను చూసి.. వాళ్లలా నువ్వు ఎందుకు ఉండవు. ఆ పిల్లలు నాకు పుట్టి ఉంటే బాగుండేది అని అంటారు. అలాగే అక్కను చూసి నేర్చుకో, తమ్ముడిని చూసి నేర్చుకో.. అని తల్లిదండ్రులు పోలుస్తారు. అసలు ఎవరి టాలెంట్ వాళ్లదే. వేరేవాళ్లలా ఉండమని మీ పిల్లలకు చెప్పవద్దు. మీరు మీలానే ఉండమని చెప్పాలి. పేరెంట్స్ వేరే వాళ్లతో పిల్లలను పోలిస్తే వాళ్లలో ఉండే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది.
నువ్వు ఎందుకు పనికిరావు
పేరెంట్స్ పిల్లలను నువ్వు అసలు నాకు ఎలా పుట్టావు. నీకు ఏం రాదు. అసలు నువ్వు దేనికి పనికి రావు. నువ్వు ఇలానే దేనికి పనికి రాకుండా పోతావు అని తిడుతుంటారు. పేరెంట్స్ పిల్లలను ఇలా అనడం కరెక్ట్ కాదు. ఇలాంటి మాటలు తల్లిదండ్రులే అంటుంటే.. పిల్లలు డిప్రెషన్‌కి గురవుతారు. జీవితంలో ఏం సాధించలేమని కుంగిపోతారు. ఎప్పుడైనా పిల్లలకు కాన్ఫిడెన్స్ వచ్చేలా మాటలు అనండి. అంతేకానీ ఇలాంటి మాటలు అనవద్దు.
ఎందుకు నువ్వు అలా ఉన్నావు
పిల్లలు అందంగా పుట్టకపోయిన, వాళ్లు జీవితంలో ఏది సాధించకపోయిన కొంతమంది పేరెంట్స్ తక్కువ చేసి మాట్లాడతారు. సన్నగా లేదా లావుగా ఉన్నావని సొంత పేరెంట్స్ మాటలతో బాధపెడతారు. పిల్లలకు ధైర్యం చెప్పాల్సిన పేరెంట్స్ ఇలా అంటే వాళ్లు తట్టుకోలేరు.
నువ్వు నాకు పుట్టకపోయి ఉంటే బాగుండేది
పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కొంతమంది తల్లిదండ్రులు ఈ మాట అంటుంటారు. నా కడుపున నువ్వు ఎందుకు పుట్టావు. ఆ రోజే చనిపోయి ఉంటే బాగుండేది. ఈరోజు అంత బాధ ఉండదు కదా అని మాటలతో పిల్లలను చంపేస్తారు. ఇలా కాకుండా పిల్లలతో ప్రేమగా మాట్లాడాలి. ఏ విషయం అయిన పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఎంత కోపం లేదా బాధ వచ్చిన పిల్లలను అసలు ఇలాంటి మాటలు అని బాధపెట్టకూడదు.