Bottu: హిందూ సంప్రదాయంలో బొట్టుకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. భర్త ఉన్న మహిళలు బొట్టు లేకుండా ఉండలేరు. బొట్టు లేకపోతే భర్త చనిపోయినట్లు భావిస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలు బొట్టు లేకుండా ఉండటానికి ఇష్టపడరు. మన సంప్రదాయం కూడా ఇదే చెబుతోంది. నుదుటన బొట్టు లేకపోతే ఆ ముఖం చూసేందుకు మొగ్గు చూపరు. వివాహితలైన వారు బొట్టు లేకుండా ఉంటే అది మంచిది కాదని చెబుతుంటారు. బొట్టు పెట్టుకున్న వారి ముఖం తేజోవంతంగా ఉంటుంది. బొట్టు లేకపోతే ఏదో వెలితిగా ఉండటం సహజమే.

నుదుటన కుంకుమ తిలకం పెట్టుకుంటే ఆమె దేవతామూర్తిలా ఉంటుంది. ఇందులో శాస్త్రీయ కారణాలు కూడా దాగి ఉన్నాయి. బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే పురాణాల్లో కూడా బొట్టుకు మంచి ప్రాధాన్యం ఉంది. పద్మ పురాణంలో, ఆగ్నేయ పురాణంలో, పరమేశ్వర సంహితలో నుదుటను కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల భర్తల ఆయుష్షు పెరుగుతుందని చెప్పబడింది. దీంతో హిందూ స్త్రీలు బొట్టు పెట్టుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అది లేకపోతే ఉండలేరు.
మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక అధిదేవతలు ఉంటారని చెబుతుంటారు. ఇందులో నుదుటికి బ్రహ్మదేవుడిని అధిదేవుడిగా పేర్కొంటారు. బ్రహ్మస్థానమైన నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. బొట్టు లేని ముఖం, ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానమని సూక్తి. ఇలా బొట్టుకు ఎనలేని విలువ ఇస్తుంటారు. ప్రతి స్త్రీ బొట్టు పెట్టుకుని లక్ష్మీదేవిలా కనిపిస్తుంది. బొట్టుకు అంతటి విశేష ప్రయోజనం ఇవ్వడం వల్ల అందరు దాన్ని ఆచారంగా భావిస్తున్నారు.

నుదుటన కుంకుమ పెట్టుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. దీంతో వారిలో లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇంకా మెదడును ఉత్సాహంగా ఉంచడంలో దోహదపడుతుంది. బొట్టు పెట్టుకోవడం వల్ల నాడులు చక్కగా పనిచేస్తాయి. క్రతువులు చేసేటప్పుడు, పుణ్యస్నానాలు ఆచరించేటప్పుడు, యాగాలు చేసేటప్పుడు, దేవతార్చన, పితృ కర్మలు ఆచరించే సందర్భంలో బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీ. నుదుటన బొట్టు లేకుండా ఈ కార్యక్రమాలు చేయరు. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోవడం మంచిదిగా భావిస్తారు.
దేవతల ఫొటోలు, ప్రతిమలకు ఉంగరం వేలితో బొట్టు పెట్టాలి. పొరపాటున కూడా మధ్య వేలితో బొట్టు పెట్టకూడదు. మధ్య వేలితో మనం బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు, సంపద రెండు వస్తాయని నమ్ముతారు. బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. మహిళలే కాదు పురుషులు కూడా బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదని పురాణాలు ఘోషిస్తున్నాయి.