Chicken Washing Safety: చికెన్ వండే ముందు దానిని నీటితో బాగా కడగడం చాలా మంది ఇళ్లలో సాధారణ అలవాటు. ముఖ్యంగా ట్యాప్ కింద పెట్టి శుభ్రం చేస్తే మలినాలు పోతాయని భావిస్తుంటారు. అయితే ఆహార భద్రత నిపుణులు మాత్రం ఇది సురక్షితమైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. చికెన్‌ను కడిగే సమయంలో నీటి చిమ్ముర్లు సింక్, కిచెన్ ప్లాట్‌ఫామ్, పాత్రలు, కూరగాయలు వంటి వాటిపై పడుతూ ప్రమాదకరమైన బాక్టీరియాను వ్యాపింపజేస్తాయని చెబుతున్నారు. దీంతో ఏం జరుగుతుందో తెలుసా?
పచ్చి చికెన్‌పై సాధారణంగా సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి హానికరమైన బాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి మన కంటికి కనిపించవు. ట్యాప్ నీటితో కడిగితే అవి పూర్తిగా పోవు. పైగా నీటి చుక్కల ద్వారా ఇతర ఆహార పదార్థాలకు చేరి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. కడిగిన చికెన్‌ను తాకిన చేతులతో ఇతర వస్తువులను ముట్టుకుంటే కూడా బాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.
కొన్ని పరిశోధనల ప్రకారం.. చికెన్‌ను కడగడం కంటే సరైన ఉష్ణోగ్రతలో బాగా వండడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అధిక వేడి వల్లే బాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. చికెన్ లోపల భాగం కూడా బాగా ఉడికేలా చూసుకోవాలి. పూర్తిగా ఉడకని చికెన్ తింటే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
చికెన్‌ను కూరగాయలు, పండ్లు, రెడీ టు ఈట్ ఫుడ్‌కు దూరంగా ఉంచడం చాలా అవసరం. పచ్చి మాంసం నుంచి వచ్చే ద్రవాలు ఇతర ఆహారాలపై పడితే క్రాస్ కంటామినేషన్ జరుగుతుంది. అందుకే ఫ్రిజ్‌లో కూడా చికెన్‌ను మూత ఉన్న డబ్బాలో లేదా కింద షెల్ఫ్‌లో ప్రత్యేకంగా నిల్వ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
కిచెన్‌లో వాడే కట్టింగ్ బోర్డులు కూడా ప్రత్యేకంగా ఉండాలి. చికెన్ కట్ చేసే బోర్డు, కూరగాయలు కట్ చేసే బోర్డు వేర్వేరుగా వాడితే బాక్టీరియా వ్యాప్తి తగ్గుతుంది. అలాగే చికెన్ కట్ చేసిన కత్తులను వెంటనే వేడి నీటితో శుభ్రం చేయడం మంచిది. ఒకే బోర్డు, ఒకే కత్తిని శుభ్రం చేయకుండా మళ్లీ వాడటం ప్రమాదకరం.
చికెన్ హ్యాండిల్ చేసిన తర్వాత చేతులను కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో బాగా కడుక్కోవాలి. అలాగే సింక్, కిచెన్ టాప్, ట్యాప్ హ్యాండిల్స్ వంటి ప్రాంతాలను కూడా శుభ్రపరచాలి. చాలామంది చేతులు కడిగినా కిచెన్ ఉపరితలాలను మర్చిపోతారు. దీంతో అక్కడ ఉన్న బాక్టీరియా మళ్లీ ఇతర ఆహారాలకు చేరే అవకాశం ఉంటుంది.
కొంతమంది చికెన్‌పై నిమ్మరసం, వెనిగర్ లేదా పసుపు వేసి కడిగితే బాక్టీరియా పోతుందని అనుకుంటారు. అయితే ఇవి వాసన తగ్గించడంలో సహాయపడినా ప్రమాదకర సూక్ష్మక్రిములను పూర్తిగా తొలగించలేవని నిపుణులు చెబుతున్నారు. సరైన హైజీన్ పాటించడం, బాగా ఉడికించడం మాత్రమే భద్రమైన మార్గమని స్పష్టం చేస్తున్నారు.