
CNG cars : పెట్రోల్, డీజిల్ తో కారు నడపడం ఇప్పుడు అత్యంత ఖరీదైన అంశం. అదే సమయంలో ఇవి పర్యావరణానికి కూడా ప్రమాదం. కర్బన ఉద్గారాలతో కలుషితం చేస్తాయి. రోజురోజుకీ ఇంధన ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎన్జీ గ్యాస్ తో నడిచే కార్లే ప్రత్యామ్నాయం అవుతున్నాయి. సీఎన్జీ కార్ల ఇంధనం ధర తక్కువే. వీటి నుంచి పర్యావరణానికి హాని తక్కువే. మైలేజ్ విషయంలోనూ సీఎన్జీ కార్లు బెటర్ ఆప్షనే.
పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్ల వినియోగదారులు కొత్త దారులు వెతుకుతున్నారు. అలాంటి వారికి సీఎన్జీ కార్లు ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. తక్కువ ధరలో.. మంచి మైలేజ్ ఇస్తున్నాయి. పర్యావరణానికీ వీటి నుంచి ఎలాంటి హాని లేదు. దీంతో వినియోగదారులు సీఎన్జీ వైపు మళ్లుతున్నారు. మార్కెట్లో దొరుకుతున్న మంచి సీఎన్జీ కార్ల పేరు చెప్పాలంటే.. వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వాటిలో ప్రముఖమైన బ్రాండ్ల వివరాలు ఇక్కడ పేర్కొంటున్నాము.

స్విఫ్ట్ : మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన స్విఫ్ట్ కారు.. ఎప్పుడూ వినియోగదారులకు మంచి ఆప్షన్ అవుతుంది. తక్కువ ధరలో మంచి మైలేజి ఇస్తుంది. ఒక కిలో సీఎన్జీ గ్యాస్ కు దాదాపు 31 కిలో మీటర్ల మైలేజ్ వస్తుంది. దీని ధర 5.99 లక్షల నుంచి 8.96 లక్షల వరకు ఉంటుంది.
బలేనో : స‌్విప్ట్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన కారు.. బలేనో అని చెప్పవచ్చు. ఇది కూడా ఒక కిలో సీఎన్జీ గ్యాస్ కు 31 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ధర 6.45 లక్షల నుంచి 9.66 లక్షల వరకు ఉంటుంది. ఈ కారును ప్రజలు బాగా ఇష్టపడి కొంటున్నారని చెప్పవచ్చు.
గ్లాన్జా : గ్లాన్జా టయోటా కంపెనీకి చెందిన కారు. మెరుగైన టెక్నాలజీతో గ్లాన్జాలో సీఎన్జీ వేరియంట్ అందుబాటులో ఉంది. దీని ధర 6.59 లక్షల నుంచి 9.99 లక్షల వరకు ఉంది.
ఆల్టో 800 : ఆల్టో కారు దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్ కారని చెప్పవచ్చు. ఇది అద్భుతమైన మైలేజిని ఇస్తుంది. దీని సీఎన్జీ వేరియంట్ ఒక కిలో సీఎన్జీకు.. దాదాపు 32 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ధర 3.53 లక్షల నుంచి 5.12 లక్షల వరకు ఉంటుంది.
ఎస్ ప్రెస్సో : ఇది అత్యంత ఇంధన సమర్థవంతమైన కార్లలో ఒకటి. ఎస్ ప్రెస్సో మారుతి సుజుకి కంపెనీకి చెందినది. ఇది ఒక కిలో సీఎన్జీకు దాదాపు 33 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ధర 4.25 లక్షల నుంచి 6.10 లక్షల వరకు ఉంటుంది.
వేగనార్ : ఇది మారుతి కంపెనీకి చెందిన అత్యంత పురాతనమైనది. మైలేజీలో కూడా తనకు తానే సాటి అన్నట్టు ఉంటుంది. ఇది 34 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ధర 5.52 లక్షల నుంచి 7.39 లక్షల వరకు ఉంటుంది.
సెలెరియో : అత్యంత ఇంధన సామర్థ్యం గల కార్లలో సెలెరియో ఒకటి. ఇది మారుతి కంపెనీకి చెందినది. దాదాపు ఒక కిలో సీఎన్జీకి 36 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ధర 5.33 లక్షల నుంచి 7.12 లక్షల వరకు ఉంటుంది.
కాలం మారుతున్న కొద్దీ ప్రజల అభిరుచుల్లో కూడా మార్పు వస్తోందని చెప్పవచ్చు. అందుకు ఉదాహరణగా సీఎన్జీ కార్ల వినియోగాన్ని చూపవచ్చు. ప్రజల్లో పర్యావరణ పై అవగాహన పెరిగింది. వ్యక్తిగత శుభ్రతతో పాటు… సామాజిక శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగా కలుషిత ఉద్గారాలను విడుదల చేసే పెట్రోల్, డీజిల్ కార్లకు స్వస్తి పలుకుతున్నారు.