Chanakya Niti Friendship: నీ స్నేహితులెవరో చెప్పు నీవెలాంటివాడితో చెబుతాం అంటారు. మనం ఎవరితో స్నేహం చేస్తామో మన గుణాలు కూడా అలాగే ఉంటాయి. ఆరు నెలలు ఎవరితో ఉంటామో అప్పుడు వారు వీరవుతారు అంటారు. మన గుణం మారడానికి మన చుట్టు ఉండే స్నేహితులు కూడా కారకులే. అందుకే అంటారు తెలివైన శత్రువు కంటే తెలివితక్కువ మిత్రుడే ప్రమాదకరమని. ఆచార్య చాణక్యుడు మన స్నేహితులు ఎలా ఉండాలి? ఎవరితో మనం స్నేహం చేయాలనే వాటిపై వివరించాడు.
మోసపూరితమైన వ్యక్తి
నిజాయితీ, నమ్మదగని, చెడు వ్యక్తిగా పేరున్న వాడితో స్నేహం చేయడం అసలు మంచిది కాదు. అతడితో ఉంటే నీ వ్యక్తిత్వం కూడా మంచిది కాదనే అభిప్రాయం వస్తుంది. విశ్వసనీయత లేని వ్యక్తి సహవాసం ఎప్పటికైనా ప్రమాదమే. అలాంటి వారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. లేకపోతే మన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.
సమస్యను అర్థం చేసుకోండి
మనకు చిక్కులు వచ్చినప్పుడు దాని తీవ్రతను అర్థం చేసుకుని సాధ్యాసాధ్యాలపై ఓ అవగాహనకు రావాలి. వ్యూహాత్మకమైన అడుగులు వేస్తేనే సమస్యను సరైన కోణంలో పరిష్కరించుకోవచ్చు. అంతేకాని ఆదరా బాదరా నిర్ణయాలు తీసుకుంటే కష్టాలు ఎదురవుతాయి. సానుకూల నిర్ణయం తీసుకుంటే సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది.
కష్టాల్లో ఉన్నప్పుడు..
మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని వాడు స్నేహితుడే కాదు. ఆపద సమయంలో అండగా ఉండేవాడే అసలైన స్నేహితుడు. అంతేకాని సుఖంలో తోడుండేవాడు స్వార్థపరుడే. మనం దుఖం కలిగినప్పుడు ఓదార్చి మన వెంట ఉండేవాడు నిజమైన వాడు. అంతేకాని సుఖాల్లో ఎవరైనా ఉంటారు. కానీ కష్టాల్లో మనకు సాయం చేస్తేనే మనకు రక్షణగా నిలిచినట్లు భావించాలి.
మంచి నిర్ణయాలు
అవసరమైన సమయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. సమస్యను విశ్లేషించి దృఢమైన నిర్ణయం తీసుకుంటే మంచిది. పనులు వాయిదా వేసుకోకుండా పరిస్థితిని చక్కదిద్దుకోవాలి. నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకోకపోతే కష్టమే. జీవితం మనుగడకు మంచి నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అంతేకాని పరస్పర విరుద్ధమైన పనులు చేయడం వల్ల నష్టాలే వస్తాయని ఆచార్య చాణక్యుడు సూచించాడు.