Buy assets: డబ్బు ఎవరికైనా కావాల్సిందే. కానీ ఇది అందరి వద్ద ఒకేలా ఉండదు. కొందరి వద్ద ఎక్కువగానూ.. మరికొందరి వద్ద తక్కువగాను ఉంటుంది. అయితే తక్కువ ఆదాయం ఉన్నవారు.. తమ అవసరాలు, కోరికలను తీర్చుకోవడానికి డబ్బు సరిపోనప్పుడు అప్పులు చేస్తూ ఉంటారు. ఈ అప్పులకు వడ్డీలు కడుతూ.. చేసిన కష్టమంతా ధారబోస్తారు. చివరకు కోరికలు, సౌకర్యాలు మాత్రమే మిగిలిపోతాయి. ఎలాంటి డబ్బు మిగలదు. అయితే కొన్ని కోరికలు, సౌకర్యాలను దూరం చేసుకుంటే కావలసినంత డబ్బు మిగులుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా అంటున్నాడు. అసలు అప్పులు కాకుండా ఆస్తులు మిగిలాలంటే ఏం చేయాలి?
పొదుపు:
చాలామంది యువత కొత్తగా ఉద్యోగంలోకి చేరగానే వెంటనే ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలని అనుకుంటారు. వీటిలో ఎక్కువగా కారు, ఇల్లు లాంటివి ఉంటాయి. వీటికి సరిపోయేంత డబ్బు లేకపోయినా.. లోన్ తీసుకొని మరి ఏర్పాటు చేసుకుంటారు. దీంతో నెల నెల ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అయితే కొత్తగా ఉద్యోగం లోకి చేరిన వారికి ఇల్లు, కారు, ఇతర ఖరీదైన వస్తువులు అత్యవసరం కాదు. ఇలాంటి సౌకర్యాలు ఉండొద్దని కాదు.. కనీసం 50% చేతిలో డబ్బు ఉంటేనే ఇలాంటి వాటి జోలికి వెళ్లాలి. లేకుంటే ఆర్థిక భారం మీద పడుతుంది.
పెట్టుబడులు:
కొంతమందికి ఖర్చులకు పోను ఆదాయం మిగిలితే ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలని చూస్తారు. లేదా షికారుకు వెళ్లాలని అనుకుంటారు. అయితే ఇలా మిగిలిన ఆదాయంతో పెట్టుబడులు పెట్టాలి. ఇవి ఎప్పటికైనా ఎంతోకొంత లాభాన్ని చేకూరుస్తాయి. అయితే పెట్టుబడును పెట్టాలని ఆలోచన ఉన్నవారు.. అప్పులు చేస్తారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం కరెక్ట్ కాదు. అవసరమనుకుంటే కొన్ని రకాల లగ్జరీ వస్తువులను మినహాయించుకొని వీటిపై దృష్టి పెట్టాలి. ఇవి ఎప్పటికైనా రిటర్న్ ఆదాయాన్ని తెస్తాయి.
అత్యవసర నిధి:
వచ్చిన ఆదాయంలో 50 శాతం ఖర్చులు పోగా.. 25% పెట్టుబడులకు ఉపయోగించగా.. మిగిలిన 25 శాతం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే నేటి కాలంలో ఉద్యోగం, వ్యాపారం ఎలాంటి భరోసాను ఇవ్వదు. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆస్పత్రికి సంబంధించిన అవసరం ఏర్పడినప్పుడు ఈ అత్యవసర నిధిని ఉపయోగించుకుంటే.. రెగ్యులర్ ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఫలితంగా ఖర్చులను, పెట్టుబడులను డిస్టర్బ్ చేయకుండా ఉండొచ్చు. అందువల్ల అత్యవసర నిధి ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండాలి.
అధిక ఆదాయం:
ప్రస్తుత కాలంలో ఏ ఉద్యోగం చేసినా.. సరిపోయేంత ఆదాయం రావడం లేదు. దీంతో అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేయాలి. ఇది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అయితే అదనపు ఆదాయం ద్వారా అదనంగా పెట్టుబడును పెట్టుకోవచ్చు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా అదరపు ఆదాయం ద్వారా కొన్ని ఖర్చుల భారం నుంచి తప్పించుకోవచ్చు.
ఇలా ప్రతి ఒక్కరూ ఆర్థిక ప్రణాళికలను వేసుకోవడం ద్వారా ఎలాంటి ఆర్థిక భారం ఉండకుండా ఉంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుపుతున్నారు.