Marriage Cancel
Marriage Cancel : పెళ్లికి మన భారతీయ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ దానిని పాశ్చాత్యపోకడలకు పోయి అపహాస్యం చేస్తున్నారు. పెళ్లంటే కేవలం మూడు ముళ్లు అనుకుని మూడు రోజులకే చేసుకున్న వాళ్లకు గుడ్ బై చెబుతున్నారు. అది కూడా విచిత్రమైన కారణాలతో ఇలా చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వివాహాలు ఆపడం, రద్దు చేయడం అనేది ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయింది. కానీ, తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సిబిల్ (CIBIL) స్కోర్ చూసి పెళ్లిని క్యాన్సిల్ చేయడం ఎవరూ ఊహించని విషయం. కానీ, ఇదే నిజంగా జరిగింది.
ఎక్కడ, ఎప్పుడు జరిగింది?
ఈ ఘటన మహారాష్ట్రలోని ముల్తిజాపూర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఒక యువతి, యువకుడు పరస్పరం ఒకరికొకరు నచ్చుకున్నారు. పెద్దలు కూడా వారి వివాహాన్ని అంగీకరించి, పెళ్లికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న సమయంలో యువతీ కుటుంబం ఊహించని షరతు విధించింది.
సిబిల్ స్కోర్ ఎందుకు చూడాలనుకున్నారు?
పెళ్లికి ముందే ఆర్థిక భద్రత, స్థిరమైన ఆదాయం అబ్బాయి కలిగి ఉన్నాడా లేదా అన్నది తెలుసుకోవడానికి వధువు మేనమామ వరుడి CIBIL స్కోర్ చెక్ చేయాలని అడిగాడు. సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ స్కోర్, అంటే వ్యక్తి అప్పులు, రుణ చెల్లింపుల రికార్డు ఆధారంగా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అప్పు ఇచ్చే ముందు పరిశీలించే ముఖ్యమైన ప్రమాణం.
సిబిల్ స్కోర్ తక్కువగా రావడంలో పెళ్లి క్యాన్సిల్
అంతటితో ఆగకుండా, వధువు కుటుంబ సభ్యులు వరుడి సిబిల్ స్కోర్ తీసుకురావాలని పట్టుబట్టారు. వరుడు తన క్రెడిట్ రిపోర్టును చూపించిన తర్వాత, అది తక్కువ సిబిల్ స్కోర్ అని తెలిసింది. దీంతో వరుడికి ఆర్థిక స్థిరత లేదని, భవిష్యత్తులో కుటుంబాన్ని నడపలేడని భావించిన వధువు కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుంది.
ఈ ఘటనపై నెటిజన్ల స్పందన
ఈ విచిత్రమైన సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక నెటిజన్.. “కాబోయే జీవిత భాగస్వామి ఆర్థికంగా స్థిరంగా ఉంటేనే కదా భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందని” కామెంట్ చేశారు. మరొక నెటిజన్ .. “సేవింగ్, ఆదాయం, క్రమశిక్షణ ముఖ్యం కానీ, ఒక్క సేబిల్ స్కోర్ వల్ల పెళ్లిని రద్దు చేయడం వాస్తవికత కాదు” అంటూ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తం చేశాడు. ఇంకోక నెటిజన్.. “ఇకపై పెళ్లి ఫిక్స్ చేసుకునే ముందు ఫోటో, గోత్రం కాకుండా CIBIL స్కోర్ కూడా అడగాల్సిందే!” అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.
మొత్తానికి ఇదివరకు జాతకం, గోత్రం, వంశం, ఆస్తులు వంటివి పెళ్లి సంబంధాల్లో కీలక పాత్ర పోషించేవి. కానీ, ఇప్పుడు సిబిల్ స్కోర్ కూడా పెళ్లిని నిర్ణయించే ఒక ప్రమాణంగా మారిందా? అనే ప్రశ్నను ఈ ఘటన తెరమీదకు తెచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి ఆర్థిక ప్రమాణాలు మరింత ప్రాముఖ్యత పొందే అవకాశముందా? అనే దాని మీద కూడా చర్చ ప్రారంభం అయింది.