Tirumala summer rush : వేసవికాలంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వెళ్తుంటారు. ఏప్రిల్ లో పిల్లలకు వార్షిక పరీక్షలు ముగుస్తాయి. పరీక్షలు ముగిసిన వెంటనే చాలామంది తిరుమల దారి పడుతుంటారు. అందువల్లే వేసవికాలంలో తిరుమల క్షేత్రం భక్తులతో కిటికిటలాడుతూ ఉంటుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో వివిఐపీలు, విఐపి లు ఉంటారు. ఇంతమంది భక్తులకు ఒకేసారి దర్శన భాగ్యం కల్పించడం అంత సులభం కాదు. అందువల్లే భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ వేసవికాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వినూత్నమైన ప్రణాళికలను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం వివిఐపి, విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అంతేకాదు ఎస్ఎస్ డీ టోకెన్ల జారీని కూడా రద్దు చేసింది. ఇప్పుడు వేసవి కాలంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా అదే విధానాన్ని పాటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించినట్టు సమాచారం.
మే ఒకటి నుంచి రద్దు
మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేయనుంది. స్లాటేడ్ సర్వదర్శనం టోకెన్ జారీ కూడా నిలిపివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తున్నది. ఎస్ ఎస్ డీ టోకెన్ల దర్శనానికి సంబంధించి 23 గంటల సమయం పడుతుంది. అందువల్ల విఐపి బ్రేక్ దర్శనాన్ని రద్దుచేసి.. సామాన్యులకు స్వామివారి దర్శనాన్ని కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది. దీనివల్ల సామాన్య భక్తులు ఎనిమిది గంటల నుంచి 12 గంటల మధ్యలోనే స్వామివారిని దర్శించుకోవచ్చు. దీనివల్ల ప్రతిరోజు 80 వేల మందికి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తున్నది. వివిధ దర్శనాలను పూర్తిగా పక్కన పెట్టి.. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఇదే విధానాన్ని దేవస్థానం అమలు చేసింది. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని పాటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి వీఐపీలకు రోజు రెండు నుంచి మూడు గంటల వరకు సమయం కేటాయిస్తున్నారు. దీనిని పూర్తిగా రద్దుచేసి.. ఆ సమయంలో 15,000 మంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించవచ్చని అధికారులు సూచించిన సమాచారం. విపరీతమైన రద్దీ వల్ల సామాన్యులు స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచిస్తున్నట్టు సమాచారం.
మిగతా కేటగిరీలు కూడా
ఇతర కేటగిరిల దర్శనాన్ని కూడా రద్దు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల భక్తులకు వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుంది. దర్శనాలు జరగడం కూడా వేగం పుంజుకుంటుంది. సామాన్య భక్తులు స్వామివారి దర్శనానికి గంటలు తరబడి క్యూలైన్లలో ఎదురుచూస్తున్నారు. గడిచిన మూడు సంవత్సరాలుగా వేసవికాలంలో స్వామివారిని ప్రతినెల 23 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు జాగ్రత్త చర్యలుగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా అమలు చేసిన విధానాలను ఇప్పుడు కూడా ఆచరణలో పెట్టనుంది.
