
కరోనా వైరస్ కొత్త వేరియంట్ల పుట్టుకొస్తున్న నేపథ్యంలో కొవిడ్-19 టీకా బూస్టర్ డోసు అవసరం కావచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరి నాటికి దీని అవసరం ఉండొచ్చని అన్నారు. అలాగే 2-18 ఏళ్ల లోపు పిల్లల కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా.. తుది దశ ప్రయోగ పరీక్షల ఫలితాలు సెప్టెంబరు నాటికి వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. కొంతకాలం తర్వాత కొవిడ్ టీకా ప్రభావం తగ్గే అవకాశం ఉన్నందున మనకు బూస్టర్ డోస్ అవసరం కావచ్చు అని గులేరియా చెప్పారు.