India vs South Africa : ధర్మశాల మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముల్లన్ పూర్ లో ఎదురైన ఓటమి తర్వాత టీమిండియా మంచి కం బ్యాక్ ఇచ్చింది. బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. రెండో మ్యాచ్లో దుమ్మురేపిన డికాక్ ను తొలి ఓవర్ లోనే వెనక్కి పంపి అర్ష్ దీప్ సింగ్ టీమిండియా కు అద్భుతమైన బహుమతి అందించాడు.. ఇదే జోరు మిగతా బౌలర్లు కొనసాగించడంతో టీమ్ ఇండియాకు తిరుగులేకుండా పోయింది.. బౌలర్ల అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
రెండవ మ్యాచ్లో దారుణమైన బౌలింగ్ వేసిన అర్ష్ దీప్ సింగ్.. మూడో మ్యాచ్లో ఫామ్ లోకి వచ్చాడు.. 13 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు.. వరుణ్ చక్రవర్తి 11 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. కులదీప్ యాదవ్ 12 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు దక్కించుకున్నాడు.. హర్షిత్ రాణా 34 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు.. భారత బౌలర్లు దుమ్మురేపడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులపై చాప చుట్టేసింది. దక్షిణాఫ్రికా సారథి మార్క్రం 61 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఉన్నంతసేపు టీమిండియా 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అతడు అవుట్ అయిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
గిల్ ఐదు బౌండరీలు కొట్టినప్పటికీ.. అసౌకర్యంగానే బ్యాటింగ్ చేశాడు.. 28 బంతులు ఎదుర్కొన్న అతడు 28 పరుగులు చేసినప్పటికీ.. మైదానంలో ఉన్నంతసేపు ఇబ్బంది పడ్డాడు.. గిల్ కు సరైన టెక్నిక్ లేకపోవడంతో మధ్య ఓవర్లలో దక్షిణాఫ్రికా బౌలర్లు టీమిండియా మీద ఒత్తిడి తీసుకొచ్చారు.. దాదాపు 5 ఓవర్ల దాకా టీమిండియా ఒక్క బౌండరీ కూడా సాధించ లేదంటే బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు తేజం తిలక్ వర్మ 34 బంతుల్లో 26* పరుగులు చేశాడు. ఇతడు మూడు బౌండరీలు సాధించాడు. మధ్య ఓవర్లలో తిలక్ వర్మ కూడా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు నీరసం వచ్చింది.. ఒకానొక దశలో మ్యాచ్ ఒత్తిడి దాకా వెళ్తుందని అందరూ అనుకున్నారు. 9 నుంచి 13 ఓవర్ల మధ్యలో దక్షిణాఫ్రికా అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. దీంతో నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే టీమ్ ఇండియాకు వచ్చాయి. సూర్య కుమార్ యాదవ్ 11 బంతుల్లో 12 పరుగులు చేసినప్పటికీ.. అతడి స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు.
సూర్య కుమార్ యాదవ్, గిల్ ఫామ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ వారు తమ ఆట తీరు మార్చుకోవడం లేదు.. స్వదేశంలో మరికొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.. అలాంటప్పుడు వీరిద్దరూ ఇలానే ఆడితే జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2024 లో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించింది.. ఈసారి స్వదేశంలో జరిగే టీ 20 వరల్డ్ కప్ సాధించాలని టీమ్ ఇండియా గట్టిగా భావిస్తోంది. అలాంటప్పుడు నాయకుడు, ఉప నాయకుడు ఇలా ఆడితే కష్టమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.