Kalyan Chand lottery winner : మనం బాగా అనుకున్నది అన్ని సందర్భాలలో నెరవేరదు. మనం కలలో కూడా ఊహించంది ఒక్కోసారి నెరవేరుతుంది.. పైగా మనల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఇతడికి కూడా అలాంటిదే ఎదురయింది. ఫలితంగా అతడి రాత మారిపోయింది. అతడి జీవితం ఒక్కసారిగా కీలకమైన మలుపుతీసుకుంది. అంతేకాదు.. అతడిని జాతీయస్థాయిలో నిలబెట్టింది.
అతడి పేరు కళ్యాణ్ చంద్. టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇతడి సొంత ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా ఫతేపూర్. టాక్సీ డ్రైవర్ గా పని చేసే కళ్యాణ్.. డబ్బు సంపాదించడానికి అనేక రకాలుగా కష్టాలు పడేవాడు. అయితే ఖర్చులకు, అతడి ఆదాయానికి పొంతన కుదిరేది కాదు. ఈ నేపథ్యంలో అతడికి ఒక కిరాయి వచ్చింది. ఒక ప్రయాణికుడు పంజాబ్ రాష్ట్రంలోని బటిండా కు వెళ్లాలని కోరడంతో.. ఒప్పుకున్నాడు కళ్యాణ్. ఆ తర్వాత అతడిని తన వాహనంలో పంజాబ్లోని బటిండా ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతడిని దింపాడు.
స్థానికులు లాటరీ గురించి చర్చించుకుంటూ ఉండగా.. కళ్యాణ్ అక్కడి స్టాల్ లో 500 రూపాయల విలువైన రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. జీవితం ఏదైనా టర్న్ తీసుకుంటుందో.. అదృష్టం ఏమైనా తలుపు తడుతుందో అనుకుని.. ఆశావాహ దృక్పథంతో ఆ లాటరీ టికెట్లను అతడు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు.
ఇటీవల రతన్ లాటరీ స్టాల్ లో డ్రా తీయడం మొదలుపెట్టారు. అయితే కళ్యాణ్ జీవితం మారిపోయే విషయం స్టాల్ నిర్వాహకులు చెప్పారు. ఎందుకంటే కళ్యాణ్ కొనుగోలు చేసిన టికెట్లు ఒకదానికి మూడు కోట్ల లాటరీ తగిలింది. ఈ విషయాన్ని నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పడంతో కళ్యాణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్నటిదాకా అతడు మామూలు టాక్సీ డ్రైవర్.. ఇప్పుడు ఏకంగా కోటీశ్వరుడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు కోట్లకు అధిపతి.. లాటరీలో మూడు కోట్లు రావడంతో కళ్యాణ్ తన ఆనందాన్ని చుట్టుపక్కల వారితో గట్టిగానే పంచుకున్నాడు..
“ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. చిన్నప్పటినుంచి పేద కుటుంబంలోనే జీవించాల్సి వస్తోంది. చాలా కోరికలు ఉన్నాయి. గొప్ప గొప్ప ఆశయాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చుకోవాలి. నా వంతుగా జీవితాన్ని ఆస్వాదించాలి. మా వాళ్లకు కూడా మెరుగైన భవితవ్యాన్ని ఇవ్వాలి. అందుకోసం ఈ డబ్బులు ఖర్చు పెడతాను. కొంత భవిష్యత్తు కోసం దాచుకుంటానని” కళ్యాణ్ కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్నాడు.
