Tamil Nadu custodial death case G అప్పట్లో జై భీమ్ అనే ఒక సినిమా వచ్చింది గుర్తుందా.. అందులో ఓ డబ్బున్న వ్యక్తి ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసింది వేరే వ్యక్తులు అయితే.. అమాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేరం చేయకపోయినప్పటికీ ఒప్పుకోవాలని ఒత్తిడి తీసుకొస్తారు. తీవ్రంగా హింసిస్తారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు అందులో ఒక వ్యక్తి చనిపోతాడు. ఆ తర్వాత ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. చివరికి ఒక న్యాయవాది రంగంలోకి దిగి.. పోలీసులు చేసిన దుర్మార్గాన్ని బయటపెడతాడు. ఈ కేసులో ఎన్నో రకాల సంక్లిష్టతలను అతడు చేధిస్తాడు.
అచ్చం అటువంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. కాకపోతే ఇది కరోనా సమయంలో మొబైల్ దుకాణం తెరిచారని తండ్రి కొడుకుల మీద పోలీసులు అభియోగాలు మోపారు. అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి రాత్రి మొత్తం చిత్రహింసలకు గురి చేశారు. తీవ్ర గాయాలైన వారిద్దరు చనిపోయారు.
ఈ సంఘటన నాడు తమిళనాడులోనే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. కరోనా సమయంలో తమిళనాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మొబైల్ షాప్ తెరిచాడని పోలీసులు అభియోగాలు మోపారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన తండ్రిని అరెస్టు చేయడంతో అతడి కొడుకు పోలీసుల వద్దకు వెళ్లాడు. అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి.. సెల్ లో వేశారు. వారిద్దరిని తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలు కావడంతో వారిద్దరూ చనిపోయారు.
ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు కీలకమైన తీర్పును సోమవారం వెల్లడించింది. 2020లో జరిగిన ఈ సంఘటనలో మొత్తం తొమ్మిది మంది పోలీసులను నిందితులుగా పేర్కొంటూ మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం సోమవారం మ*ర*ణశిక్ష విధించింది. ఇది అత్యంతమైన క్రూరమైన నేరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తమిళనాడులోని సాతంకుళ ప్రాంతానికి చెందిన జయరాజు అనే వ్యక్తి మొబైల్ షాప్ నిర్వహిస్తుంటాడు. ఇతడికి బెన్నీక్స్ అనే కుమారుడు ఉన్నాడు. వీరిద్దరూ పోలీసుల కస్టడీలో చనిపోయారు. లాకప్ లో పోలీసులు తీవ్రమైన చిత్రహింసలకు గురి చేయడంతోనే వీరిద్దరూ చనిపోయినట్టు న్యాయస్థానం విచారణలో నిర్ధారణ అయింది. ఈ కేసును దాదాపు ఆరు సంవత్సరాల పాటు కోర్టు విచారించింది. చివరికి దర్యాప్తు కొలిక్కి వచ్చింది. ముందుగా అడిషనల్ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ముత్తు కుమారన్ 9 మంది పోలీసులను నిందితులని ప్రకటించారు.
కస్టడీలో జయరాజ్, బెన్నీక్స్ పై పోలీసులు ప్లాన్ చేసి రాత్రంతా కొట్టారని.. అందువల్ల వారిద్దరు చనిపోయారని న్యాయస్థానం అభిప్రాయపడింది. సిబిఐ వాదనతో కోర్టు అంగీకరించింది . కోర్టు మరణశిక్ష విధించిన వారిలో ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుళ్ళు మురుగన్, సమదురై, కానిస్టేబుళ్ళు ముత్తు రాజ్, చల్లా దురై, థామస్ ఫ్రాన్సిస్, వేలిముత్తు ఉన్నారు. అయితే ఈ కేసులో సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు కరోనా తో చనిపోయాడు.
ఈ కేసులో జూన్ 22న జయరాజు, జూన్ 23న బెన్నీక్స్ చనిపోయారు. వీరిద్దరు కూడా కోవిల్ పట్టి సబ్ జైల్లో ఉండగానే చనిపోవడం విశేషం. వారిద్దరూ చనిపోయిన తర్వాత అధికారులు సాక్ష్యాధారాలను మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించారు. రక్తపు మరకలు ఉన్న దుస్తులను పారేశారు. నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక తప్పుడు కేసును నమోదు చేశారు.. సెల్ లో ఉన్న గోడలు.. మూత్రశాలలు.. ఎస్ హెచ్ వో గది.. లాఠీ ల నుంచి సేకరించిన రక్త నమూనాలు.. చనిపోయిన వారి డీఎన్ఏలతో సరిపోయాయి.