Shreyas Iyer captaincy : ఢిల్లీని ఐపిఎల్ లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కోల్ కతా ను విజేతగా నిలిపాడు. గత ఏడాది పంజాబ్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఇప్పుడైతే పంజాబ్ జట్టుకు ఓటమినేది లేకుండానే ఐపిఎల్ లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు. అతడికి గాయాలయ్యాయి. అంతకుమించి అవమానాలు ఎదురయ్యాయి. అవన్నీ కూడా అతడిలో కసిని పెంచాయి. చూస్తుండగానే అతడిని అత్యంత శక్తివంతుడిగా చేశాయి. పుష్ప సినిమాలో.. అల్లు అర్జున్ అన్నట్టుగా.. ఇక్కడ నేను పని చేయడానికి రాలేదు.. ఏలేయ్యడానికి వచ్చిన.. అనే తీరుగా అతని ఆట కొనసాగుతోంది.
ఇటీవల ముంబై జట్టుతో మ్యాచ్ జరిగినప్పుడు.. హార్దిక్ పాండ్యా కొట్టిన బంతిని అయ్యర్ పట్టిన విధానం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డక్ అవుట్ లో కూర్చున్న రోహిత్ శర్మను ఆశ్చర్యపడేలా చేసింది. సూర్య కుమార్ యాదవ్ ను నోరు వెళ్లబెట్టేలా చేసింది. ఇద్దరు దిగ్గజ ప్లేయర్లు ఒక ఆటగాడి ఫీల్డింగ్ చూసి ఆశ్చర్యపోయారంటే.. అతడి కమిట్మెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
2024లో షారుక్ ఖాన్ జట్టు ఐపిఎల్ విజేతగా నిలిచినప్పుడు.. ఆ ఘనత మొత్తం గౌతమ్ గంభీర్ ఖాతాలోకి వెళ్లిపోయింది. వాస్తవానికి ఆ ఘనత రావాల్సింది.. దక్కాల్సింది ముమ్మాటికి శ్రేయస్ అయ్యర్ కు. అందువల్లే కదా అతడు కోల్ కతా జట్టు నుంచి వెళ్ళిపోయింది.. పంజాబ్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ అయ్యర్ ఆకాశంలో విహరించలేదు. అతడు భూమి మీదనే ఉన్నాడు. అందువల్లే పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ అతనిని తమకు దొరికిన గౌరవ సర్పంచ్ గా భావిస్తోంది.
ఐపీఎల్ లో అయ్యర్ అదరగొడుతున్న నేపథ్యంలో.. స్థిరమైన ఇన్నింగ్స్ ఆడుతున్న క్రమంలో.. అతనికి దాదాపుగా ప్రమోషన్ లభించినట్టేనని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టి20 ఫార్మాట్ , వన్డే ఫార్మాట్ కు అతడిని సారధిగా నియమించినట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని సమాచారం. బీసీసీఐ పెద్దలు లీకులు ఇస్తున్నారని.. అందువల్లే జాతీయ మీడియాలో ఈ స్థాయిలో వార్తలు వస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అతడు సారథిగా నియమితుడైన నాటి నుంచి ఇప్పటివరకు టీమిండియా ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. నాయకుడిగా అతడు గొప్పగానే ఉన్నప్పటికీ.. ఆటగాడిగా విఫలమవుతున్నాడు. వచ్చే టీ 20 వరల్డ్ కప్ ను కూడా సొంతం చేసుకోవాలని టీమ్ ఇండియా ముఖ్యంగా గౌతమ్ గంభీర్ భావిస్తున్న నేపథ్యంలో అయ్యర్ ను సారథిగా చేస్తారని తెలుస్తోంది. మరోవైపు వన్డేలలో గిల్ తన స్థాయిలో ఆడటం లేదు. జట్టు విజయాలలో ముఖ్యపాత్ర పోషించడం లేదు. అందువల్లే ఆ ఫార్మేట్ లో కూడా అయ్యర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని మేనేజ్మెంట్ బలంగా డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇవే గనుక నిజమైతే అయ్యర్ నక్కతోక తొక్కినట్టే.