School Fee: ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునేవారు. ఎక్కడ నగరంలోనే ప్రైవేట్ విద్యాలయాలు ఉండేవి. ఆర్థికంగా స్థితిమంతంగా ఉన్నవారు మాత్రమే ఆ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునేవారు. కాలం గడిచే కొద్దీ ఆర్థిక స్థిరత్వం పెరుగుతూ వచ్చింది. చదువు చెప్పించడాన్ని కూడా స్టేటస్ సింబల్ గా చెప్పుకునే రోజులు వచ్చాయి. తెలుగు నాట ఆ రెండు కాలేజీల వల్ల ప్రైవేట్ విద్యా వ్యవస్థ అంతకంతకు పెరిగిపోయింది. ప్రైవేట్ విద్యాసంస్థలను నిర్వహించేవారు ఏకంగా ప్రభుత్వాలను శాసించే స్థాయికి వచ్చేశారు. ఇప్పుడు ప్రైవేట్ విద్యాలయాల్లో చదువుకోకపోతే నామోషీగా అనుకునే రోజులు వచ్చేశాయి. ప్రభుత్వ విద్యాలయాల్లో దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే చదువుతున్నారు. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.
మెజారిటీ తల్లిదండ్రులు అప్పులు చేసైనా సరే తన పిల్లల్ని ప్రైవేట్ విద్యాలయాల్లో చదివిస్తున్నారు. లక్షలకు లక్షలు పోసైనా సరే తమ పిల్లల్ని గొప్పగా చూడాలి అనుకుంటున్నారు. దురదృష్టవశాత్తు ప్రైవేట్ విద్యాలయాల్లో చదువుతున్న వారు అంతంత మాత్రమే ప్రతిభ చూపిస్తుండగా.. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న వారు మాత్రం అదరగొడుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవం ఇంత చేదుగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ప్రైవేట్ విద్యాలయాల్లో ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆమధ్య హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ విద్యాలయంలో ఎల్కేజీ ఫీజు దాదాపు 3 లక్షల వరకు ఉంటుందనే వార్త సంచలనం సృష్టించింది. ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు స్పందించాల్సిన ప్రభుత్వం.. స్పందించకుండా మీనమేషాలు లెక్కించడమే అసలైన విషాదం. తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నప్పుడు.. మధ్యలో ప్రభుత్వానికి ఎందుకు కష్టం అనే వాదనలు ఉన్నప్పటికీ.. అందరు కూడా ఆ స్థాయిలో ఫీజులు చెల్లించలేరు కదా. పైకి ప్రభుత్వం అధిక ఫీజులను నియంత్రిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ.. వాస్తవంలో మాత్రం అలా ఉండదు.
ఇక మన హైదరాబాద్ గురించి పక్కన పెడితే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ అంతర్జాతీయ పాఠశాలలో పిల్లల ఫీజుల విషయం ఒకసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఆ స్కూల్లో ఫీజుల వ్యవహారాన్ని చూసి నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఏడాదికి ఒకటి నుంచి ఐదు తరగతులకు 7.35 లక్షలు.. 6 నుంచి 8 తరగతుల వరకు 7.75 లక్షలు, 9 నుంచి 10 తరగతి లకు 8.5 లక్షల ఫీజు అని ఆ స్కూల్ యాజమాన్యం పేర్కొనడం విశేషం. మరోవైపు ఈ ఫీజులను రెండు విడతలుగా చెల్లించాలని ఆ స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు అడ్మిషన్ ఫీజు ఏకంగా లక్ష్యాన్ని స్పష్టం చేసింది. అయితే అడ్మిషన్ ఫీజు ఒకేసారి చెల్లించాలని.. ఒకవేళ విద్యార్థి పాఠశాలలో చేరకపోతే అడ్మిషన్ ఫీజు రిఫండ్ చేయడం కుదరదని ఆ స్కూల్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. అయితే ఇలా ఫీజులను వసూలు చేస్తున్న ఆ స్కూల్ పేరును కర్ణాటక మీడియా బయటకి చెప్పకపోవడం విశేషం. ఐటి రాజధానిగా పేరుపొందిన కర్ణాటకలో ఇన్నాళ్ళ వరకు నివాస సముదాయాల అద్దెలు ఆకాశంలో ఉంటాయని వార్తలు వచ్చేవి. ఇప్పుడు స్కూల్ ఫీజులు కూడా అదే స్థాయిలో ఉంటాయని మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ద్వారా తెలుస్తోంది. ఎంతైనా బెంగళూరు రిచెస్ట్ సిటీ.