Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఒకవేళ రిజర్వేషన్లు గనుక ఒక కొలిక్కి వస్తే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ తెలంగాణ రాజకీయాలు వేడి వేడిగానే ఉన్నాయి. కెసిఆర్ ఇటీవల హఠాత్తుగా విలేకరుల ముందుకు వచ్చి తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒకానొక దశలో తోలు తీస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామంటూ కీలక ప్రకటన కూడా చేశారు..
కెసిఆర్ ఆ స్థాయిలో మాట్లాడటం.. ఆ తర్వాత కేటీఆర్ కూడా అంతకు మించిన స్థాయిలో స్పందించారు. రేవంత్ రెడ్డిని ఫుట్ బాల్ ఆడుకుంటామంటూ హెచ్చరించారు. కెసిఆర్, కేటీఆర్ మాట్లాడిన తర్వాత ప్రభుత్వంలోని మంత్రులు కూడా అదే స్థాయిలో వారికి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ పరిణామాలు ఇలా సాగుతుండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి కెసిఆర్, కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు. కోస్గి ప్రాంతంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ల సన్మాన సభలో ముఖ్యమంత్రి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. అంతేకాదు, కెసిఆర్, కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. “నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలోకి రాదు. రెండు సంవత్సరాలు వ్యవసాయ క్షేత్రంలో ఉండి.. ఇప్పుడు బయటికి వచ్చిన కేసీఆర్ తోలు తీస్తామని హెచ్చరిస్తున్నారు. కెసిఆర్ సోయి లేని మాటలు మాట్లాడారు. అంతేకాదు స్థాయి లేని విమర్శలు చేశారు. గతంలో నా కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. నన్ను వేధింపులకు గురి చేశారు. నేను కూడా వారి మాదిరిగానే వ్యవహరిస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించాను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే కూలబడిపోయారు. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేం ఉండదు కదా. వ్యవసాయ క్షేత్రాన్ని కెసిఆర్ బందిఖానగా మార్చుకున్నారు. చుట్టూ తెలంగాణ పోలీసులు ఉన్నారు. ఇలాంటి అప్పుడు చర్లపల్లి జైలుకు వెళ్లినా.. చంచల్ గూడ జైలుకు వెళ్లినా పరిస్థితి మారదు కదా. నన్ను గెలకకండి. మర్యాదగా ఉండదని మాట్లాడటం లేదు. నేను నల్లమల నుంచి వచ్చాను. ముందుగా జడ్పిటిసి, ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే, ఎంపీ అయ్యాను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నానని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కెసిఆర్ తర్వాత కేటీఆర్ పై రేవంత్ నిప్పులు చెరిగారు..” రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇదేం పాస్ పోర్ట్ బ్రోకర్ వ్యవహారం కాదు. దుబాయ్ పంపుతామని నేను ఎవరిని మోసం చేయలేదు. స్థిరాస్తి వ్యాపారం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. హైదరాబాదులో స్థిరాస్తి వ్యాపారం పడిపోయిందని కేటీఆర్ అంటున్నారు. బిడ్డా నువ్వెంత? నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చావ్.. ఏపీలో చదువుకొని వచ్చిన నీకు తెలంగాణ గురించి ఏం తెలుసు? మా ఊరికి నువ్వు వస్తావా? మీ ఊరికి నేను రావాలా? యువర్ భయపడుతున్నారు తెలుస్తుంది.. బిడ్డా లాగులో తొండలు విడిచిపెడతా జాగ్రత్త” అంటూ రేవంత్ హెచ్చరించారు. అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో 2/3 మెజారిటీతో అధికారంలోకి వస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. 80 కి పైగా సీట్లను గెలుచుకుంటామని స్పష్టం చేశారు. ఒకవేళ తెలంగాణలో 153 సీట్లు కనుక ఏర్పడితే 100కు పైగా స్థానాలలో విజయం సాధించి, రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ పేర్కొన్నారు.