Peddi box office collection : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తూనే ఉంది. 11 రోజుల తర్వాత కొంత డ్రాప్స్ ని సొంతం చేసుకున్నప్పటికీ , 2 వ వీకెండ్ మొదలయ్యే లోపు కాస్త వసూళ్లు ఊపందుకున్నాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 3 వ శనివారం, అనగా 17 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి అట. నైజాం , ఉత్తరాంధ్ర మరియు నెల్లూరు జిల్లాలు బాగా పికప్ అయ్యాయి. అందుకే ఇంత షేర్ వచ్చిందని అంటున్నారు. ఇకపోతే ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం. ముందుగా బ్రేక్ ఈవెన్ అవ్వని ప్రాంతాల గురించి మాట్లాడుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ మరియు నెల్లూరు ప్రాంతాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం ఇక దాదాపుగా అసాధ్యమే. నిర్మాతలు రిటర్న్ జీఎస్టీ ఇచ్చిన రీకవర్ అవ్వలేని సెంటర్స్ ఇవి. 17 రోజుల్లో సీడెడ్ ప్రాంతం నుండి ఈ చిత్రానికి 20 కోట్ల 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. విడుదలకు ముందు ఇక్కడ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 24 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే దాదాపుగా 3 కోట్ల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లింది అన్నమాట. ఇక నెల్లూరు విషయానికి వస్తే విడుదలకు ముందు 6 కోట్ల 30 లక్షల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, 17 రోజుల్లో 5 కోట్ల 70 లక్షలు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక లో 17 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా , ఇప్పటి వరకు కేవలం 15 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది.
అదే విధంగా ఓవర్సీస్ లో 34 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, 17 రోజుల్లో 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇక హిందీ వెర్షన్ లో అయితే పాతిక కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు కేవలం 12 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 50 శాతం కి పైగా నష్టాలు అన్నమాట. ఇక తమిళనాడు + కేరళ కలిపి 7 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగితే , ఇప్పటి వరకు 2 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ ప్రాంతాల్లో నష్టాలు భారీగా వాటిల్లాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ లాభాలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రానికి 146 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు 223 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 336 కోట్ల రూపాయిల గ్రాస్, 198 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
