non stick cookware safety : ఇళ్లలో ఉండే వంట పాత్రల్లో కూడ ఆరోగ్యం ఉంటుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. వంట పాత్రలు బాగుంటేనే అందులో వండిన ఆహారం తినడం వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో భాగంగా నాన్-స్టిక్ వంట పాత్రల వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. నాన్ స్టిక్ వంట పాత్రల వాడకం ఇప్పుడు చాలా ఇళ్లలో సాధారణమైపోయింది. అయితే వీటి భద్రతపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా గీతలు పడిన నాన్-స్టిక్ పాత్రల్లో వండిన ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Apollo Hospitalsకు చెందిన ప్రముఖ వైద్యురాలు Sangita Reddy వెల్లడించిన ప్రకారం.. నాన్ స్టిక్ వంట పాత్రలపై గాతలు పడితే క్యాన్సర్ కారకాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగా నాన్-స్టిక్ పాత్రలపై ప్రత్యేకంగా కోటింగ్ ఉంటుంది. ఇది Polytetrafluoroethylene అనే పదార్థంతో తయారవుతుంది. మార్కెట్‌లో ఇది సాధారణంగా Teflon పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ కోటింగ్ వల్ల ఆహారం అంటుకోదు. తక్కువ నూనెతో వంట చేయవచ్చు. కానీ కోటింగ్ దెబ్బతింటే సమస్య మొదలవుతుంది.
ఒక పరిశోధన ప్రకారం టెఫ్లాన్ కోటింగ్ ఉన్న పాత్రపై ఒక్క చిన్న గీత పడినా వేల సంఖ్యలో మైక్రో, నానో పరిమాణంలోని కణాలు బయటకు రావచ్చు. కొన్ని అధ్యయనాలు ఒక గీతతోనే 9,000కు పైగా సూక్ష్మకణాలు విడుదలయ్యే అవకాశం ఉందని సూచించాయి. ఇవి ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. పాత తరహా నాన్-స్టిక్ తయారీలో Perfluorooctanoic acid వంటి PFAS కెమికల్స్ ఉపయోగించేవారు. ఇవి “ఫారెవర్ కెమికల్స్”గా పేర్కొంటారు. ఇవి శరీరంలోకి వెళితే సులభంగా బయటకు వెళ్లలేవు. కాలేయం, థైరాయిడ్, హార్మోన్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని పరిశోధనలు చెబుతున్నాయి.
PFAS తరహా కెమికల్స్ దీర్ఘకాలం శరీరంలో పేరుకుపోతే కొన్ని రకాల క్యాన్సర్లకు సంబంధం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇవి ముఖ్యంగా కిడ్నీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే టెస్టిక్యులర్ క్యాన్సర్ రిస్క్ పెరగొచ్చని కొన్ని అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఇది ఎక్కువగా దీర్ఘకాలిక, అధిక ఎక్స్‌పోజర్‌పై ఆధారపడి ఉంటుంది. PFAS కెమికల్స్ హార్మోన్లను ప్రభావితం చేసి పురుషులు, మహిళల్లో ఫెర్టిలిటీని తగ్గించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. గర్భిణుల్లో కూడా జాగ్రత్త అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గీతలు పడిన నాన్-స్టిక్ పాత్రలను వెంటనే మార్చాలి.మెటల్ స్పూన్లు కాకుండా చెక్క లేదా సిలికాన్ స్పూన్లు వాడాలి.ఖాళీ పాత్రను ఎక్కువ వేడి చేయకూడదు
260°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయకూడదు.పాత కోటింగ్ ఊడిపోతే వాడకూడదు. అయితే ఇవి పాడైపోతే వీటికి బదులుగా Stainless steel cookware, Cast iron cookware, సిరామిక్ కోటెడ్ పాత్రలు వాడుకోవాలి. సరైన విధంగా వాడితే నాన్-స్టిక్ పాత్రలు పూర్తిగా ప్రమాదకరం కావు. కానీ గీతలు పడినవి, పాతవి, అధిక వేడి చేసినవి మాత్రం ఆరోగ్యానికి హానికరమయ్యే అవకాశం ఉంది.