Kalvakuntla Kavita : భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ అయిన తర్వాత.. కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రయాణం విషయంలో సరికొత్తగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఆమె రాజకీయ పార్టీ పెడతారని ప్రచారం జరిగినప్పటికీ.. ఇంతవరకు ఆ దిశగా ప్రకటన రాలేదు. పైగా కల్వకుంట్ల కవిత జాగృతి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కార్యవర్గాలను ఏర్పాటు చేశారు. కార్యవర్గాల ఏర్పాటు కూడా తక్షణమే అమలుకి వస్తుందని ఆమె ప్రకటించారు.
ప్రస్తుతం జనం బాట పేరుతో ఆమె కార్యక్రమాలు చేపడుతున్నారు. తన అత్తవారిళ్లైన నిజామాబాద్ ప్రాంతం నుంచి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితిలో జరిగిన అంతర్గత వ్యవహారాలను.. తనను ఇబ్బంది పెట్టిన విధానాలను ఆమె మొహమాటం లేకుండా బయటపెడుతున్నారు. తనను ఎన్నికల్లో ఓడించారని.. తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కవిత వ్యాఖ్యానించారు.. పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ గులాబీ పార్టీలో ఉన్న కీలక నాయకుల వ్యవహార శైలి పట్ల కవిత మండిపడుతూనే ఉన్నారు. జనం బాట కార్యక్రమంలో ప్రతిరోజు కొత్త విమర్శలు చేస్తూనే ఉన్నారు.
రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వని కవిత కొత్త విషయాలు చెప్పారు. ” నాతో పార్టీ పెట్టించడానికి కేసీఆర్ బయటికి పంపించారని అందరూ అంటున్నారు. కానీ అందులో నిజం లేదు. నాతో పార్టీ పెట్టించాల్సిన అవసరం కేసీఆర్ కు లేదు. అందరికీ మంచి జరగాలని జనం బాట కార్యక్రమాన్ని చేపట్టాను. అవసరమైతే కచ్చితంగా రాజకీయ పార్టీని పెడతాను. నన్ను బయటకి పంపి పార్టీ పటాల్సిన అవసరం కేసీఆర్ కు ఎందుకు ఉంటుంది. కల్వకుంట్ల చంద్రశేఖర రావును విషయాల ఆధారంగానే నేను విమర్శిస్తాను. భారత రాష్ట్ర సమితిని కూడా అలాగే విమర్శిస్తాను. ఏకపక్షంగా విమర్శలు చేయను. ఆధారం లేకుండా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం నేను చేయను. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిది. ఆ పార్టీ నాకు మద్దతు ఇవ్వడం ఏంటని” కవిత వ్యాఖ్యానించారు.
కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ ప్రకారం ఆమె త్వరలోనే రాజకీయ పార్టీని పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.. జాగృతి పేరు మీద పార్టీ పెడతారా? మరొక పేరు నిర్ణయించుకుంటారా? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభిస్తుందని కవిత అంతరంగీకులు పేర్కొంటున్నారు. కవిత ద్వారా తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు చోటు చేసుకుంటాయని.. ప్రజలు ఆమె కు బ్రహ్మ రథం పడుతున్నారని చెబుతున్నారు.. త్వరలో రాజకీయ పార్టీ పెడితే కవితవెంట చాలామంది నడుస్తారని వారు వివరిస్తున్నారు.