చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంటులో వాటిపై విస్తృత స్థాయి చర్చలు జరగకపోవడం పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. వి. రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్వం పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చలు జరిగేవని గుర్తుచేశారు. తద్వారా కోర్టులకు వాటిని విశ్లేషించేందుకు వీలుగా ఉండేదన్నారు. ఏ లక్ష్యంతో ఎవరిని ఉద్దేశించి ఆ చట్టాలను రూపొందించారో న్యాయస్థానాలకు సులువుగా అర్థమయ్యేదన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం సందర్భంగా పార్లమెంటులో జరిగిన చర్చను అందుకు ఉదాహరణగా చెప్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అండ్ బెంచ్ నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.