
తెలంగాణలో కరోనా తీవ్రత కారణంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీకి ఐరిస్ విధానం అమలు చేయొద్దని దాఖలైన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కంటి ద్వారా కొవిడ్ సోకే ప్రమాదం ఉన్నందున ఐరిస్ విధానం అమలు చేయొద్దని హైదరాబాద్ కు చెందిన ప్రకాష్, సజ్జు, మాలన్ బేగం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఐరిస్ ద్వారా కాకుండా ఇతర ధ్రువీకరణతో రేషన్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. అయితే కంటి ద్వారా కరోనా సోకదని వైద్య నిపుణులు చెబుతున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి, కమిషనర్ కు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 22 కి వాయిదా వేసింది.