india women vs pakistan women : క్రికెట్ అనేది అద్భుతమైన ఆట. క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్లేయర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏమాత్రం ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదు. అలా ఇస్తే చూస్తుండగానే ఫలితం మారిపోతుంది. ఏమరపాటుగా ఉంటే అసలుకే మోసం వస్తుంది. పాపం ఈ విషయం పాకిస్తాన్ జట్టుకు ఆలస్యంగా అర్థమైంది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఆ జట్టుపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.
క్రికెట్లో పాకిస్తాన్ పురుషుల జట్టు నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ లాగా ఉంటుంది. ఇప్పుడు మహిళల జట్టు కూడా అదే దారిని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ప్లేయర్ చేసిన నిర్లక్ష్యం కొంపముంచింది. బంతి గమనాన్ని అంచనా వేయకుండా.. ఫీల్డర్ వేగాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. పాకిస్తాన్ ప్లేయర్ చేసిన తప్పు అభాసు పాలు చేసింది. ఫలితంగా టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టింది.
మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో టీమిండియా, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 247 పరుగులు చేసింది. బంతి అనేక రకాల మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో.. టీమ్ ఇండియా బ్యాటర్లు వేగంగా పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు శుభారాంబాన్ని అందించినప్పటికీ.. ఆ తర్వాత ఆ జోరును టీమిండియా చివరి వరకు కొనసాగించలేకపోయింది. ప్లేయర్లు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. చివర్లో రీచా వేగంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ ఆమాత్రమైన స్కోర్ చేయగలిగింది. వాస్తవానికి ఈ మైదానంలో ఆ స్కోర్ పెద్దగా లెక్కలోది కాకపోయినప్పటికీ.. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి పాకిస్తాన్ ప్లేయర్లను కట్టడి చేశారు.
పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో మైదానంలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ బ్యాటర్ నిర్లక్ష్యం వల్ల తగిన మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. పాకిస్తాన్ ఓపెనర్ మునిబా భారత బౌలర్ క్రాంతి బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించింది. బంతి ఆమె కాలును తాకి దూరంగా వెళ్లిపోయింది. అదే సమయంలో మునిబా క్రీజ్ నుంచి బయటికి వెళ్లింది. అక్కడే ఉన్న దీప్తి బంతిని నేరుగా వికెట్ల వైపు విసిరింది. క్రీజ్ లో మునిబా లేకపోవడంతో అంపైర్ రన్ ఔట్ గా ప్రకటించారు. క్రికెట్ నిబంధన ప్రకారం బంతి కీపర్ లేదా బౌలర్ ఎండ్ లో ఉన్నప్పుడే అనుమతి తీసుకొని బ్యాటర్ క్రీజ్ నుంచి వెళ్ళిపోవాలి. అలా కాకుండా వెళ్ళిపోతే అవుట్ అవాల్సి ఉంటుంది. మునిబా కూడా ఇలానే అవుట్ అయింది.