IT Raids : మన దేశంలో ఎవరికైనా వ్యాపారం చేసే హక్కు ఉంది. వ్యాపారం ద్వారా లభించే ఆదాయానికి సంబంధించిన పన్ను సక్రమంగా చెల్లించాలి. ఇలా సక్రమంగా చెల్లించకుండా.. వ్యాపారం కోసం బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని చాలామంది ఎగవేత కు పాల్పడుతుంటారు.. అలాంటి వారు దర్జాగా దేశాలు దాటి వెళ్లిపోతున్నారు.. ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకుని విదేశాలలో దర్పాన్ని వెలగబెడుతున్నారు. ఇప్పటివరకు ఈ జాబితాలో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి వారు ఉన్నారు. అయితే దేశంలో ఉంటూ.. దేశ సంపదను దోచుకునే వారు చాలామంది ఉన్నారు. ఐటీ అధికారులలో తనిఖీలలో వారు బయటపడ్డారు.
మనదేశంలో ఒకప్పుడు హోటళ్ల వ్యాపారం ఒక స్థాయి వరకే ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఆ వ్యాపారం అంతకుమించి అనే స్థాయిలో పెరిగింది. చాలామంది జనాలు ఇంట్లో తినడం కంటే.. బయట తినడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఆయా హోటళ్ల గిరాకీ విపరీతంగా పెరిగింది. ఆదాయం కూడా అంతకుమించి అనే స్థాయిలో వస్తోంది. దీంతో హోటల్స్ నిర్వహించేవారు కోట్లకు పడగలెత్తుతున్నారు. అయితే వీరంతా కూడా వచ్చిన ఆదాయానికి తగ్గట్టుగా టాక్స్ చెల్లించడం లేదు. పైగా తాము పొందిన డబ్బును వివిధ మార్గాలలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చిన డబ్బును కూడా ఇతర మార్గాలకు తరలిస్తున్నారు. తద్వారా ఇంకా తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అయితే వీరి వ్యవహార శైలి పట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వారు సోదాలు చేశారు. ఫలితంగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ వార్తలు మీడియాలో అంతగా రావడం లేదు. అంతర్గత వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం హైదరాబాదులోని ప్రముఖ బిర్యాని హోటల్స్ పిస్తా హౌస్, షా గౌస్ యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో భారీగా నగదు, బంగారం పట్టుపడ్డాయి. అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో 20 కోట్లు నగదు, పెద్ద మొత్తంలో నగదు, ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ హోటల్ నిర్వాహకులు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ.. అదే స్థాయిలో పన్నులు చెల్లించకపోవడంతో దాడులు జరిగినట్టు తెలుస్తోంది.
ఈ హోటల్స్ నిర్వహించే వారికి పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి.. అందువల్లే ప్రభుత్వాలకు సక్రమంగా పన్నులు చెల్లించడం లేదని తెలుస్తోంది. అయితే వీరంతా ఆ నగదును వివిధ రూపాలలో దాచినట్టు సమాచారం. పైగా కీలక ఆస్తి పత్రాలను కూడా అధికారులు గుర్తించారంటే వీరి దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మనం విజయ్ మాల్యా, నీరవ్ మోడీ గురించి మాట్లాడుకుంటాం. కానీ వారికి మించే స్థాయిలో ఇటువంటి హోటల్స్ నిర్వాహకుల అడ్డగోలు దందాలు ఉంటాయి.