Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాల( Godavari festivals ) నిర్వహణపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పుష్కరాల ముహూర్తం ఫైనల్ అయింది. అనేక చర్చల తర్వాత పండితుల సూచనల మేరకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. ముఖ్యంగా రైల్వే శాఖ భారీ సన్నాహాలు చేయడం విశేషం. మరోవైపు పుష్కరాలు సమీపిస్తున్న వేళ పనుల నిర్వహణ కోసం ఒక కమిటీని కూడా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి పుష్కరాలకు ప్రత్యేకతలు అనేకం. అయితే వివిధ రకాల కారణాలతో పుష్కరాల ముహూర్తం పై కొంత సందిగ్ధత చోటుచేసుకుంది. వెతకాలకు దానిపై క్లారిటీ వచ్చింది.
* ఎనిమిది కోట్ల మంది వస్తారని అంచనా..
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు జరగనున్నాయి. దాదాపు 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ప్రత్యేక రోజుల్లో అయితే గరిష్టంగా 75 వేల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే పుష్కర ఘాట్లు పెంచారు. భక్తులంతా ఏకకాలంలో గోదావరి పుష్కర స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇప్పటికే మూడు కీలక సమీక్షలు పూర్తి చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాజమండ్రి పరిధిలో అన్ని దేవాలయాలను పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలకు సంబంధించి రాజమండ్రిలో రూ.9.55 కోట్ల పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేసినట్లు వివరించారు. రాజమండ్రి తో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని వివరించారు.
* దాదాపు అన్ని జిల్లాల్లో..
గత అనుభవాల దృష్ట్యా ఒక్క రాజమండ్రి ( Rajahmundry)నగరం పైనే దృష్టి పెట్టడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. గోదావరి నది ప్రవహించే అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో సైతం పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రతి ఘాట్లో 50 మీటర్లకు ఒక కంపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 10 సామాజిక మరుగుదొడ్లు, రెండు దుస్తులు మార్చే గదులు, ఆరు వాటర్ ఏటీఎంలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఉత్తర భారతదేశం నుంచి సైతం ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ను సైతం అభివృద్ధి చేస్తున్నారు.