Janasena Party symbol
Janasena Party : జనసేనకు( janasena ) గుడ్ న్యూస్. తెలంగాణలోనూ ఆ పార్టీకి గుర్తింపు లభించింది. ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో ఏపీలో సూపర్ విక్టరీ సాధించింది జనసేన. 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో ఘనవిజయం సాధించింది. ఏపీలో జనసేన ప్రాంతీయ పార్టీగా గుర్తించబడిందని.. తెలంగాణలోనూ గుర్తించాలని.. గాజు గ్లాస్ గుర్తు ఇవ్వాలని ఆ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఏపీలో జనసేన పార్టీ సాధించిన ఘనవిజయంతో ఆ పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తించారు. గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే గుర్తింపునకు నోచుకోవడంతో జనసైనికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
* ఏపీలో ఇటీవల చోటు
ఆంధ్రప్రదేశ్లో ( Andhra Pradesh)గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో ఇటీవల జనసేన చోటు దక్కించుకుంది. నిబంధనల ప్రకారం ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది ఎన్నికల సంఘం. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేక కూడా అందింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 100 స్ట్రైక్ రేట్ తో విజయం సాధించింది. 100% స్ట్రైక్ రేట్ పార్టీగా జనసేన రికార్డ్ సృష్టించింది. అందుకే ఎన్నికల సంఘం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.
* అడ్డంకిగా నిబంధనలు
2014లో జనసేన( janasena) ఆవిర్భవించింది. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపింది జనసేన. 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కానీ ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయ్యింది. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సీట్లు, ఓట్లు రాకపోవడంతో జనసేన గుర్తు గాజు గ్లాసు ప్రమాదంలో పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో ఇబ్బందికరంగా మారింది. జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో పర్వాలేదు కానీ.. జనసేన బరిలో లేని చోట ఇండిపెండెంట్ లకు గాజు గ్లాసు గుర్తును కేటాయించే విధంగా ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చారు.
* గతంలో తెలంగాణలో ఇబ్బంది
గతంలో తెలంగాణ( Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఆ సమయంలో గుర్తు ఇబ్బందికరంగా మారింది. అందుకే ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి ఉపశమనం దక్కింది. ఏపీలో ప్రాంతీయ పార్టీల సరసన చేరింది. తెలంగాణలో రిజర్వ్డ్ గుర్తుగా గాజు గ్లాస్ గుర్తింపు దక్కించుకుంది. మొత్తానికైతే జనసేనకు వరుసగా ఉపశమనం కలిగించే నిర్ణయాలు రావడం విశేషం.