Euphoria Musical Night : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా విరాళాలు, సాయం చేయడంలో అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడం పవన్ కళ్యాణ్ సొంతం. గతంలో ఇదే మాదిరిగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా విజయవాడలో తల సేమియాతో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియో పేరిట.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు తో పాటు హాజరయ్యారు. ఆధ్యాంతం ఈ కార్యక్రమం ఉత్సాహ భరిత వాతావరణంలో సాగింది. విజయవాడ నగరం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు. రాత్రి 11:30 గంటల వరకు కార్యక్రమం కొనసాగింది.
* ఆ చిన్నారుల సహాయార్థం
ఎన్టీఆర్ ట్రస్ట్ ( NTR trust) ఏర్పాటు చేసి 28 సంవత్సరాలు అవుతోంది. ఎన్నో రకాల సేవలు అందిస్తోంది ఈ ట్రస్ట్. ముఖ్యంగా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలుస్తోంది. అందుకే వారి వైద్య సేవలకు గాను.. ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించింది. ట్రస్టు అధ్యక్షురాలు నారా భువనేశ్వరి విన్నపం మేరకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ ఈవెంట్ నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. అయితే వీవీఐపీ టికెట్లకు సంబంధించి లక్ష రూపాయల చొప్పున అందించాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఐదు టిక్కెట్లను కొనుగోలు చేశారు. తన కుటుంబ సభ్యులకు గాను వ్యక్తిగతంగా ఐదు లక్షల రూపాయలు చెల్లించి ఐదు టిక్కెట్లు పొందారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు భువనేశ్వరి. టికెట్ల గురించి ప్రస్తావించగా మీరు వస్తే చాలు అని భువనేశ్వరి కోరారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కార్యక్రమానికి హాజరయ్యారు.
* ఎన్టీఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం
అయితే టిక్కెట్ కొనుగోలు చేయకుండా కార్యక్రమానికి హాజరు కావడం గిల్టీగా ఉందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. కార్యక్రమాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తల సేమియా( thalassemia ) వ్యాధిగ్రస్తుల కోసం ఈవెంట్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. 28 సంవత్సరాలుగా ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు కొనసాగుతుండడం అభినందనీయమన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్విరామంగా కొనసాగుతుండడాన్ని అభినందించారు. విదేశాల నుంచి వైద్యులు వచ్చి వైద్య సేవలు చేసి పోతారని చెప్పుకొచ్చారు. ఆసుపత్రికి సంబంధించి సేవల విషయంలో.. తమ సిఫారసులకు సైతం స్పందించిన తీరు బాగుంటుందని కొనియాడారు. అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలకు గాను తాను 50 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు. పవన్ ప్రకటనతో ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది.
* భువనేశ్వరి అభినందన
పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నారా భువనేశ్వరిని( Nara Bhuvaneswari ) అభినందించారు. ఆమె అంటే తనకు చాలా గౌరవం అన్నారు. కష్టకాలంలో సైతం ఆమె చలించలేదని గుర్తు చేశారు. తాను ఆమెను దగ్గర నుంచి చూశానని కూడా చెప్పుకొచ్చారు. అటువంటి ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలు తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణలో బాలకృష్ణ వ్యవహరిస్తున్న తీరును కూడా అభినందించారు. ఆయన తనను ఎప్పుడూ బాలయ్య అని పిలవమంటారని.. కానీ నేను మాత్రం సార్ అనే పిలుస్తానని.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎవరిని లెక్క చేయని విధానం బాలకృష్ణ సొంతమని కొనియాడారు పవన్ కళ్యాణ్. మొత్తానికి పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి హాజరై ఏకంగా 50 లక్షల రూపాయలు ప్రకటించడం విశేషం.