
తెలంగాణలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాలను దృష్టిలో ఉంచుకొని వారాంతపు లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ నెల 8వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. కరోనా పరీక్షలు తగ్గడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం రోజుకు లక్ష పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జీహెచ్ ఎంసీ పరిధిలో టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసిన విధంగా వారంలోగా అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది.