CSK poor performance 2026 : చెన్నై జట్టుకు ఐపీఎల్లో అద్భుతమైన చరిత్ర ఉంది. ధోని నాయకత్వంలో ఐదుసార్లు చెన్నై ఐపీఎల్ విజేతగా నిలిచింది. ముంబై జట్టుతో సమానంగా ipl ట్రోఫీలు అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. 2023లో విజేతగా ఆవిర్భవించిన చెన్నై.. ఆ తర్వాత అదే స్థాయిలో మ్యాజిక్ ప్రదర్శించలేకపోతోంది. 2024.. 2025 సీజన్లలో అట్టర్ ఫ్లాఫ్ అయింది.. 2025లో ధోని తాత్కాలికంగా సారథ్యం వహించినప్పటికీ చెన్నై జట్టు రాత మారలేదు.
ఇక 2026 సీజన్లో సంజు శాంసన్, కార్తీక్ లాంటి ప్లేయర్లను తీసుకున్నప్పటికీ చెన్నై జట్టు ఆటతీరు ఏమాత్రం మారలేదు.. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై అత్యంత దారుణంగా ఆడింది. చెన్నై జట్టు 19.4 ఓవర్లలోనే 127 పరుగులకు ఆల్ అవుట్ అయింది. సంజు శాంసన్, రుతు రాజ్ గైక్వాడ్, శివం దుబే వంటి ప్లేయర్లు దారుణంగా ఆడారు.. రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు. బ్రేవిస్ లేకపోవడం.. గాయం వల్ల ధోని జట్టుకు దూరం కావడంతో.. చెన్నై జట్టు పరిస్థితి అద్వానంగా మారింది.
రాజస్థాన్ బౌలర్లు పదేపదే షార్ట్ పిచ్ బంతులను వేశారు. వాటిని ఎదుర్కోలేక చెన్నై బ్యాటర్లు చేతులెత్తేశారు.. వాస్తవానికి ఏ ఒక్క ఆటగాడికి కూడా మైదానంలో ఉండి.. నిలబడి పరుగులు చేయాలనే సోయి లేకపోవడం విశేషం.. రాజస్థాన్ బౌలర్లు చాకచక్యంగా బంతులు వేయడం.. వాటిని అంచనా వేయలేక అవుట్ కావడం చెన్నై బ్యాటర్లకు ఈ మ్యాచ్లో పరిపాటిగా మారింది..
చెన్నై జట్టులో సంజు (6) ఓపెనర్ గా వచ్చాడు. ప్రభావం చూపించలేకపోయాడు. గైక్వాడ్ (6) కూడా విఫలమయ్యాడు. ఆయుష్ మాత్రే(0), షార్ట్(2), దూబే(6) కనీసం నిలబడే ప్రయత్నం కూడా చేయలేకపోయారు.. సర్ఫరాజ్ (17), కార్తీక్ శర్మ (18) రాజస్థాన్ బౌలర్లను ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివర్లో ఓవర్టన్(43) కాస్త బ్యాట్ ఝులిపించడంతో చెన్నై జట్టు ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. బర్గర్, అర్చర్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీశారు.