robot begging in China అప్పట్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమాలో.. హ్యూమనాయిడ్ రోబో ఐశ్వర్యరాయ్ ని ప్రేమిస్తుంది. చివరికి రజనీకాంత్ ను చంపడానికి కూడా వెనకాడదు. అప్పట్లో ఇది సంచలనం. వాస్తవానికి రోబో అలా చేస్తుందా అని అందరూ అనుకున్నారు.
ఇప్పుడు రోబోలు అంతకుమించి చేస్తున్నాయి. చైనా దేశంలో రోబోల మీద కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రయోగాలు జరగడం మాత్రమే కాదు రోబోలతో రకరకాల పనులు కూడా చేయిస్తున్నారు. ఆ మధ్య చైనాలో ఒక రైల్వే స్టేషన్ నిర్మాణంలో రోబోలను వినియోగించారు. అంతకంటే ముందు రోబోలతో పరుగు పందెం పోటీలు కూడా నిర్వహించారు. ఆ పోటీలలో రోబోలే విజేతలుగా నిలవడం విశేషం. అంతేకాదు తొలి 5 స్థానాలలో రోబోలే నిలిచాయి.
పనిచేయించడం, పరుగు పందాలు నిర్వహించడం మాత్రమే కాదు.. రోబోలతో ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు సరికొత్త పనులు చేస్తున్నారు. చైనాలో ఓ కంపెనీ రోబోలతో భిక్షాటన చేయించింది. అవి భిక్షాటన చేస్తున్న తీరు చూస్తే ఫ్యూచర్లో మనుషులకు పోటీ వచ్చే విధంగా కనిపిస్తోంది. ఒక రోబో అడుక్కుంటున్న తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. జన సమ్మర్ధం అధికంగా ఉన్న ప్రాంతంలో ఒక రోబో మోకాలు మీద కూర్చుంది. అంతేకాదు దర్జాగా భిక్షాటన చేస్తోంది. ఆన్లైన్ పేమెంట్స్ కూడా యాక్సెప్టబుల్ అన్నట్టుగా ఒక క్యూఆర్ కోడ్ కూడా ముందు పెట్టుకుంది. ఇది కావాలని చేస్తున్నారా.. లేదా ప్రమోషన్ కోసమా అనేది తెలియడం లేదు. కాకపోతే రోబోలతో భిక్షాటన చేయించడం అనేది మాత్రం వింతగా ఉంది. ఆ రోబో అలా అడుక్కుంటుంటే చాలామంది చైనా దేశస్తులు తమ దగ్గర ఉన్న చిల్లర వేస్తున్నారు. కొందరేమో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎంతో కొంత డబ్బులు పంపిస్తున్నారు. మొత్తానికి రోబోలతో భిక్షాటన చేయిస్తున్న చైనా శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేస్తున్నారు.
రోబోలతో ఈ పనులు మాత్రమే కాకుండా.. భవిష్యత్తు కాలంలో ఇంకా క్లిష్టమైన పనులు కూడా చేయించే అవకాశం కనిపిస్తుంది. అంతరిక్షంలోకి.. భూగర్భ గనులలోకి.. ఇలా అన్నిట్లోకి రోబోలను పంపించి అత్యంత క్లిష్టమైన పనులు చేయించి.. ప్రపంచానికి కొత్త పాఠాలు చెప్పే విధంగా చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో రోబోలు ఏం చేస్తాయో..

