Bolivia Dollar Peg : ఆఫ్రికా దేశం బొలీవియా తన కరెన్సీని అమెరికన్ డాలర్‌తో 15 ఏళ్లపాటు స్థిరంగా కట్టిపెట్టి ఉంచిన విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయం ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో స్పష్టం చేస్తోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం, దిగుమతులు మరియు విదేశీ చెల్లింపులకు అవసరమైన డాలర్లను సమకూర్చడం కష్టమవడం ఈ మార్పుకు ప్రధాన కారణాలు.
అధికారిక రేటు, పెరిగిన బ్లాక్ మార్కెట్.
ఇటీవలి కాలంలో బొలీవియాలో డాలర్ల కొరత తీవ్రమైంది. అధికారిక మారకపు రేటు ఒకటిగా ఉండగా, బ్లాక్ మార్కెట్‌లో డాలర్ ధర చాలా ఎక్కువగా ఉండటంతో ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి అక్రమ మార్కెట్ వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో పాత విధానాన్ని కొనసాగించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావించి, కరెన్సీని మార్కెట్ ఆధారితంగా మార్చాలని నిర్ణయించింది.
బొలివియానో విలువ పడిపోయే అవకాశం..
ఇకపై బొలీవియా కరెన్సీ బొలివియానో విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా నిర్ణయించబడుతుంది. దీంతో బొలివియానో విలువ గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దిగుమతి వస్తువుల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉండటం వంటి స్వల్పకాలిక సవాళ్లు ఎదురుకావచ్చు. అయితే దీర్ఘకాలంలో కరెన్సీ నిజమైన మార్కెట్ విలువను ప్రతిబింబించడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఇతర దేశాలు కూడా..
బొలీవియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచంలో కొత్తది కాదు. అర్జెంటీనా 1990లలో తన కరెన్సీని డాలర్‌తో 1:1 నిష్పత్తిలో కట్టిపెట్టింది. కానీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా 2002లో ఆ విధానాన్ని వదిలేసింది. ఆ తర్వాత దాని కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. అలాగే కజకిస్తాన్ 2015లో, ఈజిప్ట్ 2016లో తమ కరెన్సీలను మార్కెట్ ఆధారిత విధానానికి మార్చాయి. నైజీరియా కూడా విదేశీ మారక సంక్షోభం నేపథ్యంలో నియంత్రణలను సడలిస్తోంది.
డాలర్ పెగ్ విధానం కొనసాగిస్తున్న దేశాలు..
ఇప్పటికీ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్ వంటి దేశాలు ఇప్పటికీ డాలర్‌తో స్థిర అనుబంధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ దేశాల వద్ద భారీ విదేశీ మారక నిల్వలు ఉండటం వల్ల ఈ విధానాన్ని నిలబెట్టుకోవడం సాధ్యమవుతోంది. భారతదేశం డాలర్ పెగ్ విధానాన్ని అనుసరించదు. రూపాయి ’మేనేజ్డ్ ఫ్లోట్’ విధానంలో ఉండటంతో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దాని విలువ మారుతుంటుంది. అయితే తీవ్రమైన ఒడిదొడుకులు రాకుండా అవసరమైనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంటుంది.
బొలీవియా తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యం, వివిధ దేశాల కరెన్సీ విధానాలపై మరోసారి చర్చకు దారితీసింది.
