Site icon OkTelugu

ArcelorMittal Nippon Steel Andhra Pradesh : లక్ష కోట్ల పెట్టుబడి.. లక్షల ఉద్యోగాలు!.. ఏపీకి ఇదో గేమ్ ఛేంజర్

ArcelorMittal Nippon Steel Andhra Pradesh

ArcelorMittal Nippon Steel Andhra Pradesh : ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక మలుపు. ఏపీలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ గా పరిగణిస్తున్న అర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కు నేడు శంకుస్థాపన జరగనుంది. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఈ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ చేయనున్నారు. కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నది అంచనా.

* రెండు దశల్లో నిర్మాణం..
దాదాపు 5465 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. రెండు దశలలో నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి దశలో ఏటా 7.5 మిలియన్ మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్ధ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించి ఉన్నారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ కు అనుబంధంగా అర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ ఓ కాప్టివ్ పోర్టు కూడా ఏర్పాటు చేయనుంది. 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 316 ఎకరాల్లో ఈ పోర్టు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అదనంగా రూ.11,198 కోట్లు కేటాయించనున్నారు. దీని ద్వారా మరో 6000 మందికి ఉపాధి లభించనుంది.

* పారిశ్రామిక అభివృద్ధికి చేయూత
ఉమ్మడి విశాఖ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎంతగానో ఊతం ఇవ్వనుంది. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణం ద్వారా విశాఖపట్నం ఎకనమిక్ జోన్.. పారిశ్రామిక కేంద్రంగా మారనుంది. దేశీయంగా ఉక్కు అవసరాలు కూడా తీరనున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఎనలేని సాయం అందిస్తోంది. 16వ నెంబర్ జాతీయ రహదారిని అనకాపల్లి స్టీల్ ప్లాంట్ కు కలిపేలా నాలుగు వరుసల రహదారిని అభివృద్ధి చేస్తోంది.

* కేంద్ర మంత్రులు హాజరు..
స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తో పాటు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, భూపతి రాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. అర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఏ ఎం ఎం ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్ కూడా హాజరు కానున్నట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్లో రాజయ్యపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటల 40 నిమిషాలకు ఎక్స్పీరియన్స్ జోన్ సందర్శిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

Exit mobile version