Andhra Pradesh heatwave 2026 : ఏపీలో( Andhra Pradesh) ఎండలు ముదురుతున్నాయి. భానుడు సెగలు కక్కుతూ భూమిపై విరుచుకుపడుతున్నాడు. దీంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా మేలో ప్రవేశించక ముందే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి నెలలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి నుంచి 35 డిగ్రీల నమోదు అనేది సర్వసాధారణంగా మారింది. ఏప్రిల్ వచ్చేసరికి 40 డిగ్రీల వరకు చేరింది. ఇప్పుడు 45 వరకు నమోదవుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీల వరకు నమోదవుతోంది. దీంతో అంతటా అగ్గి వాతావరణం ఉంది. ఎండలకు తోడు వేడి గాలులు, ఉక్కపోత తో జనాలు అల్లాడిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ఒకటే పరిస్థితి. వందలాది మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రతగా 40 డిగ్రీలు దాటుతోంది. మరికొన్ని మండలాల్లో అయితే 45 డిగ్రీలు దాటేసాయి. ప్రధానంగా రాయలసీమ నుంచి కోస్తాంధ్ర వరకు ఉంది.
* ఈరోజు రికార్డు స్థాయిలో..
ఈరోజు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు( temperatures) నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అధిక ఉష్ణోగ్రతలతో పాటుగా 19 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు, 21 మండలాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉంది. ప్రధానంగా విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం, వంగర మండలాల్లో.. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జి యమ్మ వలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతిపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం తీవ్ర వేడి గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
* రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సోమవారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా కంభం లో 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1, ప్రకాశం జిల్లా కొప్పెరపాడు లో 44.8, అమరావతిలో 44.2, తిరుపతి జిల్లా బెస్త పల్లిలో 44.2, కడప జిల్లా వీరబల్లిలో 44.2, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మొత్తం 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలో 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* అసలే శుభకార్యాల సీజన్ కావడంతో ప్రజలు తీవ్ర సౌకర్యానికి గురవుతున్నారు. అయితే అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. మున్ముందు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
