Ande Sri death : తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు.. ప్రతిచోట జయ జయహే తెలంగాణ పాట వినిపించేది. ఒకరకంగా తెలంగాణ ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిన పాట కాదు. ఆ పాట వినిపించినప్పుడల్లా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష మరింత బలోపేతం అయ్యేది. సబ్బండ జాతిని మరింత ఎక్కువగా జాగృతం చేసేది. ఆ పాట ఉద్యమ సమయంలో ఏ స్థాయిలో అయితే వినపడిందో.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పాట వినిపించలేదు. రాష్ట్ర గీతంగా మారలేదు. అందెశ్రీకి గుర్తింపు లభించలేదు. పైగా కెసిఆర్ అకారణమైన కోపాన్ని ఆయన మీద చూపించారు. గడచిన పది సంవత్సరాల కాలంలో ఏ వేదికలో కూడా జయ జయహే గేయాన్ని వినిపించనీయలేదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని దూరం పెట్టి.. ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులను అందలమెక్కించిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ దే.. ఈ మాట అనడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది చదువుతుంటే గులాబీ కార్యకర్తలకు కోపం రావచ్చుగాని.. వాస్తవ పరిస్థితి అదే. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో తాను బతికి ఉన్నప్పుడు అందెశ్రీ వివరించారు కూడా.
అందెశ్రీ మాత్రమే కాదు.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కొంతమంది కవులు ప్రగతి భవన్ కు దూరమయ్యారు. కేవలం భజన చేసే కవులు, కళాకారులు మాత్రమే ఎమ్మెల్సీలు అయ్యారు.. కార్పొరేషన్లకు చైర్మన్లు అయ్యారు.. అందెశ్రీ గొప్ప కవి అయినప్పటికీ ఆయనను గుర్తించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. ఆయనను ఏమాత్రం పట్టించుకోలేదు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒకరోజు కూడా ఆయనను కలిసి మాట్లాడలేదు. ఇది అందెశ్రీ లో కోపాన్ని కలిగించింది. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారందరినీ కేసీఆర్ దూరం పెట్టడం.. ప్రజాస్వామ్యానికి దూరంగా పరిపాలించడంతో అందెశ్రీ కి నచ్చేది కాదు. అందువల్లే ఆయన తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై నిత్యం ఆందోళన చెందుతూ ఉండేవారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అందెశ్రీ లో ఉన్న ఆందోళనను గుర్తించారో.. దానిని వెలుగులోకి తీసుకొచ్చారు. 2023 ఎన్నికల ప్రచారంలో అందెశ్రీ తో రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎటువంటి మార్పులు చేపడతామో వివరించారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత అందెశ్రీ రాసిన జయహే జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గేయంగా మార్చారు. ఉద్యమ సమయం నాటి గేయానికి.. స్వల్ప మార్పులు చేశారు. ఆ గేయం విషయంలో గులాబీ పార్టీ నేతలు విమర్శలు చేసినప్పటికీ రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. పైగా ఆయన తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలను గుర్తించి కోటి రూపాయల వరకు ప్రభుత్వ సహాయాన్ని అందించారు. నివాస స్థలాన్ని కూడా కేటాయించారు. లాలాగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న అందెశ్రీ సోమవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురై కన్నుమూశారు. లోక్ నాయక్, జానకమ్మ వంటి ఎన్నో విశిష్టమైన పురస్కారాలను అందెశ్రీ అందుకున్నారు.
అందెశ్రీ ఇప్పుడు చనిపోయి ఉండవచ్చు గాక.. కానీ ఆయన రాసిన పాటలు ఆచంద్ర తారార్కాలు. నిత్యం తెలంగాణ ప్రజల నాలుక మీద నానుతూనే ఉంటాయి. తెలంగాణలో ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే ఉంటాయి. అందెశ్రీ భౌతికంగా లేకపోయినప్పటికీ.. ఆయన రాసిన పాటలు నిత్యం సజీవంగానే ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలకమైన పాత్ర పోషిస్తే.. అందెశ్రీ కూడా అదే స్థాయి భూమికను ప్రదర్శించారు. యావత్ తెలంగాణ సమాజం నిత్యం అందెశ్రీని స్మరించుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన సాహితి సేవ అటువంటిది.