ఇవాళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. ప్రతిఏటా నివాళులు, పుష్పగుచ్చాలతోనే ముగించిన వైఎస్ కుటుంబం.. ఈసారి ఓ సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. వైఎస్ మరణించిన 12ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లో వైఎస్సార్ ఆత్మీయ సదస్సు ఏర్పాటుకు నిర్ణయించారు ఆయన సతీమణి విజయమ్మ. ఇది రాజకీయాలకు అతీతమని, రాజశేఖర్ రెడ్డి సన్నిహితులను ఆహ్వానిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఆమె స్వయంగా కీలక నేతలకు ఫోన్లు చేసి ఆహ్వానించడం గమనార్హం.
అయితే.. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమని బయటకు చెబుతున్నప్పటికీ.. పక్కా పొలిటికల్ వ్యూహంతోనే ఏర్పాటు చేస్తున్నారనే అభిప్రాయం వ్యకమవుతోంది. తెలంగాణలో వైఎస్ కూతురు షర్మిల పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. కానీ.. ఆ పార్టీకి ఎలాంటి స్పందనా లేదు. షర్మిల ‘ఉనికి’ పాట్లు పడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా.. మరోసారి షర్మిల పార్టీని చర్చలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. వైఎస్ అభిమానులుగా ఉన్నవారిని షర్మిలకు దగ్గర చేసేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇదని అంటున్నారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ కూడా గుర్తించినట్టు కనిపిస్తోంది. వైఎస్ పేరుతో ఓటు బ్యాంకు లాగేసుకుంటే దెబ్బ పడేది కాంగ్రెస్ పార్టీకే అన్నది తెలిసిందే. అందుకే.. కాంగ్రెస్ నేతలు మరో ఎత్తుగడ వేశారు. ఈ మేరకు తెలంగాణ-ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్, శైలజానాథ్, తెలంగాణ సీఎల్పీ నేత భట్టి కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ కు కాంగ్రెస్ తరపున నివాళి అర్పించిన నేతలు.. ఆయన్ను కాంగ్రెస్ నేతగానే చెప్పుకున్నారు. అదే సమయంలో.. విజయ్మ ఏర్పాటు చేస్తున్న సమావేశానికి కాంగ్రెస్ నుంచి ఎవ్వరూ వెళ్లొద్దని తీర్మానించారు.
అటు ఏపీ నుంచి జగన్ ఈ సమావేశానికి హాజరు కావట్లేదు. కాబట్టి.. వైసీపీలో ఉన్న వైఎస్ ఆత్మీయులు కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ నుంచి కూడా కేవీపీ లాంటి వారు మినహా.. పెద్దగా హాజరు కాకపోవచ్చు. కాబట్టి, ఇక పాల్గొనేవారు ఎవరైనా ఉంటే వారు తెలంగాణ ప్రాంతానికి చెందినవారే అయ్యి ఉంటారు. ఇటు విజయమ్మకు కావాల్సింది కూడా ఇక్కడివారే. మరి, వైఎస్ ఆత్మీయులుగా ఉండి, టీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లినవారు ఈ సభకు హాజరవుతారా? అనే విషయంలో క్లారిటీలేదు.
కాంగ్రెస్ నేతలు వెళ్తే.. అది వారి వ్యక్తిగతమని, అదే సమయంలో ఏఐసీసీ ఈ వ్యవహారాన్ని చూస్తోందని పరోక్షంగా టీపీసీసీ నేతలు హెచ్చరికలు కూడా జారీచేశారు. కాబట్టి.. ఈ సమావేశానికి ఎవరు హాజరవుతారు? ఇందులో విజయమ్మ ఏం మాట్లాడుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా.. షర్మిల పార్టీకి ఏదోవిధంగా సహకారం అందించాలని చేస్తున్న ఈ సభాప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ys vijayamma conducting ysr atmiya sabha who will attending for this meeting
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com