
YS Sharmila: తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి.. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్.షర్మిల ప్రస్తుతం జనగామ జిల్లాలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పదునైన మాటలు, అధికార పార్టీనేతలపై తీవ్రమైన ఆరోపణలతో తనయాత్ర సాగిస్తున్నారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా రికార్డు సృష్టించే దిశగా యాత్రను షర్మిల కొనసాగిస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఓ గీత కార్మికుడి కోరిక మేరకు షర్మిల పోద్దాటి కల్లు రుచి చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకే నియోజకవర్గంలో ఆ ఇద్దరి యాత్ర..
పాలకుర్తి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్రతోపాటు టీపీసీసీ చీఫ్ రేతవంత్ చేపట్టిన హాథ్‌సే హాథ్ జోడో యాత్ర కూడా కొనసాగుతోంది. దీంతో నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవరుప్పుల మండలంలో దుకాణాలను మూసివేయించారు. డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరూ కేసీఆర్‌ను, కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేస్తూనే మరోవైపు ఒకరిపై ఒకరు కూడా విమర్శలు చేసుకుంటూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు ఫైర్ బ్రాండ్లు ఒకే నియోజకవర్గంలో పాదయాత్ర చేయడం ఇప్పుడు పోలీసులకు పెద్ద పని పెట్టింది.
రేవంత్ యాత్రపై షర్మిల విసుర్లు..
ఇప్పటికే వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్.షర్మిల టీపీసీసీ చీఫ్ రేవంత్ యాత్రపై విమర్శలు చేశారు. పాదయాత్ర పేరును రేవంత్‌రెడ్డి బ్రష్టు పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి చేస్తున్నది పాదయాత్రనో దొంగ యాత్రనో అర్థం కావడం లేదన్నారు. ఆయన పాదయాత్రపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కూతురని సహనం..
షర్మిల సంచలన ఆరోపణలు చేసినా రేవంత్‌రెడ్డి వాటిని లెక్కచేయడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయగా షర్మిలకు గౌరవం ఇస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. గతంలో సంగారెడ్డిలో పాదయాత్ర చేసిన షర్మిల ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కూడా ఇలాగే తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి కూతురుగా గౌరవం ఇస్తుంటే రెచ్చిపోయి మాట్లాడుతోందన్నారు. నిరాదారమైన ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాజాగా టీపీసీసీ చీఫ్‌పై షర్మిల ఆరోపణలు చేసిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ఎలా స్పందిస్తారు.. కాంగ్రెస్ శ్రేణులు ఏం చేస్తాయో అన్న ఉత్కంఠ పోలీసుల్లో నెలకొంది. యాత్రలో భాగంగా ఇద్దరు ఒకే ప్రాంతంలో ఎదురుపడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
